
గుజరాత్లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి.
గుజరాత్‌లోని కచ్ ప్రాంత ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. ఆధునిక పురోగతికి ప్రతీకగా నిలిచే ముంద్రా నగరానికి ఇప్పుడు వైమానిక రెక్కలు వచ్చాయి. అదానీ ముంద్రా విమానాశ్రయం నుండి మంగళవారం షెడ్యూల్డ్ వాణిజ్య విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. ముంద్రా నగరాన్ని దేశ ఆర్థిక రాజధాని ముంబైతో పాటు పర్యాటక స్వర్గధామం గోవాతో అనుసంధానిస్తూ సాగిన తొలి ప్రయాణం స్థానికులలో సరికొత్త ఆశలను, భావోద్వేగాలను నింపింది.ఈ విమాన సర్వీసులను ప్రాంతీయ విమానయాన సంస్థ స్టార్ ఎయిర్’ భాగస్వామ్యంతో నడుపుతున్నారు. కేవలం ముంబై, గోవాలే కాకుండా హిండన్, సూరత్, బెల్గావి, బెంగళూరు, కొల్హాపూర్, నాందేడ్ వంటి మొత్తం ఎనిమిది కీలక నగరాలకు ముంద్రా నుంచి ప్రయాణాలు సాగనున్నాయి. ఎంతో కాలంగా రైళ్లు, రోడ్డు మార్గాలపై ఆధారపడి గంటల తరబడి ప్రయాణించిన ప్రజలకు, ఈ విమాన సేవలు దూరాన్ని తగ్గించడమే కాక బంధాలను మరింత దగ్గర చేయనున్నాయి.పారిశ్రామిక సిరి ముంగిట సరికొత్త ప్రస్థానంభారతదేశంలోనే అతిపెద్ద కమర్షియల్ పోర్టుగా, భారీ ప్రత్యేక ఆర్థిక మండలిగా (SEZ) విరాజిల్లుతున్న ముంద్రా ప్రగతికి ఈ విమానాశ్రయం మరింత ఊతం ఇవ్వనుంది. నౌకాశ్రయం, పారిశ్రామిక మౌలిక వసతులతో కూడిన ఈ ప్రాంతానికి వైమానిక కనెక్టివిటీ తోడవడంతో వ్యాపారవేత్తలు, ఉద్యోగుల ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. ముంద్రా సమగ్ర మల్టీ-మోడల్ లాజిస్టిక్స్ హబ్‌గా రూపాంతరం చెందుతుండటం స్థానిక ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లనుంది.ఈ విమానాశ్రయంలో కేవలం రవాణా సౌకర్యాలే కాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మౌలిక వసతులను ఏర్పాటు చేశారు. వివిధ రకాల ప్యాసింజర్, కార్గో విమానాల ల్యాండింగ్‌కు వీలుగా 1,900 మీటర్ల పొడవైన రన్‌వేను నిర్మించారు. అత్యాధునిక టెర్మినల్ భవనంలో ప్రయాణికుల కోసం మల్టిపుల్ చెక్-ఇన్ కౌంటర్లు, వెయిటింగ్ లాంజ్‌లు, వీల్‌చైర్ యాక్సెసిబిలిటీ, ప్రత్యేక డ్రాప్-ఆఫ్ జోన్‌లు మరియు ఫుడ్ కోర్ట్ వంటి సౌకర్యాలను కల్పించారు.దేశంలోని ముంబై, అహ్మదాబాద్ వంటి ప్రధాన నగరాల ఎయిర్‌పోర్టులను విజయవంతంగా నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ విమానయాన రంగంలో మరో మైలురాయిని అధిగమించింది. పశ్చిమ గుజరాత్ ముఖచిత్రాన్ని మార్చే విధంగా రూపుదిద్దుకున్న ఈ విమానాశ్రయం పారిశ్రామిక పురోగతికే కాకుండా, కచ్ ప్రాంత పర్యాటక రంగానికి కొత్త కళను తీసుకురానుంది. దూరాలు చెరిగిపోయి, అభివృద్ధి దిశగా ముంద్రా వేస్తున్న ఈ అడుగు కేవలం ప్రయాణం మాత్రమే కాదు, ఆ ప్రాంత ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది.