
కుత్బుల్లాపూర్, జూన్23 : కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న కష్టాలు అధికార పార్టీ నాయకులకు కనిపించడం లేదా..
వారికి నిజంగానే ఇక్కడి అభివృద్ధి కనపడకపోతే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించుకొని తమ దృష్టిని మెరుగుపర్చుకోవాలని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ నాయకులు ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై కాంగ్రెస్ ఇంచార్జీ కొలన్ హనుమంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, డీసీసీ ప్రెసిడెంట్ తోటకూర వజ్రేశ్‌యాదవ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ మంగళవారం చింతల్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ నాయకులకు కెమెరాలు, మైకులు కనిపిస్తే చాలు వాస్తవాలు మాట్లాడడం మర్చిపోయి పగటి కలలు కంటున్నారని మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ ప్రజలు వరుసగా మూడు ఎన్నికల్లో ఘోరంగా తిరస్కరించినా ఇంకా వీరికి బుద్ది రాలేదని, ప్రజాతీర్పును గౌరవించే సంస్కారం కూడా వీరికి లేదని విమర్శించారు. సొంత కుటుంబ సభ్యుడిని కార్పొరేటర్‌గా గెలిపించుకోలేని వారు నేడు హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్థాయిపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. స్వప్రయోజనాల కోసం కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీ అంటూ పార్టీలు మారిన చరిత్ర వీరిదని, ప్రజా సంక్షేమం నిలబడిన మా నాయకుడిని విమర్శించే నైతిక అర్హత లేదని సూచించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామిల్లో కనీసం 10 శాతం కూడా పూర్తి చేయలేదని నాయకులు ధ్వజమెత్తారు. హైడ్రా, మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, రైతులను యూరియా కోసం క్యూలలో నిలబెట్టమేనా కాంగ్రెస్ మార్క్ అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ స్థానం పదిలంగా ఉందని, 2028లో మళ్లీ తెలంగాణలో బీఆర్ఎస ప్రభుత్వం రావడం, కుత్బుల్లాపూర్‌లో గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో మాజీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ, సురేశ్‌రెడ్డి, రషీదా మహమ్మద్ రఫీ, డివిజన్ల అధ్యక్షులు రుద్ర అశోక్, పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, దేవరకొండ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి సత్తిరెడ్డి, పార్టీ సీనియర్ నేతలు వారాల వినోద్, కమలాకర్, జల్డ లక్ష్మినాథ్, ఒంకార్రెడ్డి, క్రాంతియాదవ్, సంపత్‌గౌడ్, ఆటో బలరాం, ఆకుల ప్రభాకర్, సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.