
బూర్గంపహాడ్, జూన్ 23 : వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు)...
బూర్గంపహాడ్, జూన్ 23 : వానాకాలం పంట సాగులో రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందించేందుకు బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఏర్పాటు చేసిన విత్తన మేళా (విత్తన వారోత్సవాలు) వెలవెలబోయింది. ఈ విత్తన మేళాలో వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బంది తప్ప రైతులు ఎక్కడా కనిపించలేదు. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విత్తన మేళాలో రైతులకు ఖరీఫ్ పంట సాగుకు సంబంధించి ప్రభుత్వం సరసమైన ధరలకు ఏడు వరి విత్తనాలు, పత్తి విత్తనాలు, కూరగాయ విత్తనాలు, నానో యూరియా, యూరియా వంటి ఎరువులను సిద్ధం చేసినప్పటికీ రైతులు ఈ విత్తన మేళాకు పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఇదిలా ఉండగా వ్యవసాయ శాఖ విత్తన వారోత్సవాలకు సంబంధించి మండలంలో ముందస్తు ప్రచారం చేయకపోవడంతో విత్తన మేళాకు రైతులు హాజరుకాలేదా అనే ఆరోపణలు సైతం లేకపోలేదు. వారం రోజుల పాటు ఈ విత్తన వారోత్సవాలు నిర్వహించాల్సి ఉండగా తొలిరోజే రైతులు విత్తనమేళాకు హాజరు కాకపోవడంపై వ్యవసాయ శాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలిరోజు కార్యక్రమంలో సర్పంచ్ మందా నాగరాజు, ఉప సర్పంచ్ గుండె వెంకన్న, మండల వ్యవసాయశాఖ అధికారి శంకర్, ఏఈఓలు, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.