
సీజేఐ నిరుద్యోగులను బొద్దింకలుగా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆన్ లైన్ లో పుట్టిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP).. ఆ తర్వాత రోడ్లపైకి వచ్చేసింది.
నీట్ సహా పలు పరీక్షల్లో కేంద్రం వైఫల్యాల్ని ప్రశ్నిస్తూ ఉద్యమాలు చేపడుతోంది. దీంతో కేంద్రం ఇరుకుపడుతోంది. అలాగని కాక్రోచ్ పార్టీని అడ్డుకుంటే పరిణామాలు ఎటువైపు తిరుగుతాయో తెలియని పరిస్దితి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్న కాక్రోచ్ పార్టీ వ్యవస్ధాపకుడు అభిజీత్ దిప్కేకు కేంద్రం పిలుపు వచ్చింది.గతంలో కేంద్రం కాక్రోచ్ పార్టీ ఎక్స్ ఖాతాను నిషేధించింది. దీనిపై జరుగుతున్న విచారణకు హాజరు కావాలని కాక్రోచ్ పార్టీ బాస్ అభిజిత్ దిప్కేకు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సమన్లు పంపింది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ శనివారం నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరంతరాయంగా సాగుతున్న నిరసన ప్రదర్శనకు నాయకత్వం వహిస్తున్న దీప్కే, ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తున్న తరుణంలో కేంద్రం నుంచి ఈ పిలుపు వచ్చింది.బుధవారం మధ్యాహ్నం తమ శాఖ ప్రధాన కార్యాలయం అయిన ఎలక్ట్రానిక్స్ నికేతన్‌లో హాజరు కావాలని దీప్కేకు పిలుపు అందింది. జంతర్ మంతర్ సమీపంలోని నిరసన ప్రదేశాన్ని ఖాళీ చేయించడంలో ఢిల్లీ పోలీసుల చర్యలను ప్రస్తావిస్తూ, దీనిని సీజేపీ వర్గం తాజా ఉద్రిక్తతగా అభివర్ణించింది. నిరసన ప్రదేశానికి నీరు, ఆహారం సరఫరాకు దీర్ఘకాలంగా అంతరాయం కలుగుతోందని, అలాగే ఆ ప్రాంతంలోని మరుగుదొడ్లలో నీటి సరఫరాకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని దీప్కే ఫిర్యాదు చేశారు. మరోవైపు కాక్రోచ్ పార్టీ తీరుపై విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తొలిసారి స్పందించారు. ఎన్డీటీవీతో మాట్లాడుతూ.. విచ్చిన్నకర శక్తులకు బీ టీమ్ గా ఆ పార్టీని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో తిరస్కరించబడిన వారు మారువేషంలో వచ్చి ఇప్పుడు వ్యవస్థపై పగబట్టారని, దేశాన్ని విభజించాలనుకునే వారి కోసం వారు నినాదాలు చేస్తున్నారన్నారు.