
పాలు కొనగానే ఆ పచ్చిపాలనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నారు. అవసరానికి కొంచెం కొంచెం తీసుకుని వాడుకుంటారు. ఫ్రిడ్జ్ లో పెడితే ఫ్రెష్‌గా ఉంటుందని అనుకుంటారు
గానీ దానివల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆరోగ్య సమస్యలు తప్పవు కూడా. కొందరైతే పచ్చిపాలనే తాగితే ఎనర్జీ వస్తుందని పిల్లలకూ ఇస్తారు. అది ఇంకా ప్రమాదం. ఆవులు లేదా గేదెలకు ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే, ఆ ప్రభావం పాలలో కూడా ఉంటుంది. పాలను సరిగ్గా వేడి చేయకుండా ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు, అందులోని వైరస్లు చనిపోవు. జ్వరాన్ని కలిగించే ఇన్ఫ్లుయెంజా వైరస్లు పచ్చిపాలలో 5 రోజుల వరకు బతికే ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
పచ్చిపాలు తాగడం వల్ల బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే పాలలో వైరస్ ఉంటే అది నేరుగా మన శరీరంలోకి చేరుతుంది. పాలను మరిగించడం ద్వారా అందులోని హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లను నాశనం చేయవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. పచ్చిపాలు తాగితే ఇన్ఫెక్షన్లు కచ్చితంగా సోకుతాయి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాచిన పాల కన్నా పచ్చిపాలలోనే పోషకాలు ఎక్కువని చాలామంది అపోహ పడుతుంటారు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుందని అనుకుంటారు. కానీ ఇందులో నిజం లేదు. పచ్చిపాలు తాగడం వల్ల 200 కంటే ఎక్కువ రకాల ఇన్ఫెక్షన్లు వస్తాయని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) చెబుతోంది. పచ్చిపాలలో బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ప్రమాదకరం. ఫ్లూ వైరస్ ఆర్ఎన్ఏ పచ్చిపాలలో 57 రోజుల వరకు ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు.