
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Alireza Beiranvand Unreal Story: ఫిఫా ప్రపంచకప్ 2026లో ఇరాన్ జట్టు తరఫున ఆడుతున్న గోల్ కీపర్ అలీరెజా బీరాన్‌వాండ్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రీడా అభిమానుల నుండి ప్రశంసలు అందుకుంటున్నాడు. బెల్జియంతో జరిగిన కీలక మ్యాచ్‌లో అతడు అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. బలమైన జట్టుగా పేరున్న బెల్జియం మ్యాచ్ మొత్తం ఇరాన్ గోల్ పోస్ట్‌పై వరుసగా దాడులు చేసింది. అయితే అలీరెజా అసాధారణ ప్రతిభతో ప్రతి అవకాశాన్ని అడ్డుకుంటూ జట్టుకు అండగా నిలిచాడు. అలీరెజా అద్భుత సేవ్‌ల కారణంగా బెల్జియం ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. చివరకు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ ప్రదర్శనతో అలీరెజా పేరు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల మధ్య మార్మోగుతోంది. అతడి ధైర్యం, ఏకాగ్రత, అంకితభావం ఇరాన్ జట్టుకు గొప్ప బలంగా మారాయని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అలీరెజా బెయిరాన్‌వాండ్ విజయగాథ ఎంతో మంది యువతకు స్పూర్తిగా నిలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచ ఫుట్‌బాల్ వేదికపై గుర్తింపు పొందిన అతడి ప్రయాణం మాత్రం ఎన్నో కష్టాలు, త్యాగాలతో నిండిపోయింది. చిన్న గ్రామంలో సాధారణ కుటుంబంలో జన్మించిన అలీరెజాకి చిన్నప్పటి నుంచే ఫుట్‌బాల్ అంటే ఎంతో ఇష్టం. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో తండ్రీతో కలిసి గొర్రెలను మేపేవాడు. అతడి తండ్రికి మాత్రం ఫుట్‌బాల్ అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో అలీరెజా తన కలను నెరవేర్చుకోవాలంటే స్వయంగా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది.
ఫుట్‌బాల్ ఆటగాడిగా ఎదగాలన్న లక్ష్యంతో అలీరెజా స్వగ్రామాన్ని విడిచి రాజధాని టెహ్రాన్‌కు చేరుకున్నాడు. అక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభించిన అతడు.. ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఉండటానికి ఇల్లు లేక రోడ్లపై, మసీదుల్లో నిద్రించాడు. రోజు గడవడం కోసం కార్లు కడగడం, దుస్తుల ఫ్యాక్టరీలో పని చేయడం, పిజ్జా షాప్‌లో ఉద్యోగం చేయడం వంటి ఎన్నో చిన్న పనులు చేశాడు. ఒకసారి ఫుట్‌బాల్ క్లబ్ కార్యాలయం బయట నిద్రిస్తే.. ప్రజలు అతన్ని భిక్షగాడని భావించి నాణేలు వేసిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఫుట్‌బాల్‌లో అతడి ప్రతిభ చూసి స్థానిక క్లబ్ నాఫ్తా అతడిని అండర్-23 జట్టులోకి తీసుకుంది. అక్కడ సత్తా చాటిన అలీరెజా ఇరాన్ అండర్-23 జట్టుకు ఆడాడు. అక్కడ కూడా నిరూపించుకుని 2015లో ఇరాన్ జాతీయ జట్టులో అరంగ్రేటం చేశాడు. 2018 ఫిఫా ప్రపంచకప్‌లో పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో కొట్టిన పెనాల్టీ షాట్‌ను అడ్డుకోవడం ద్వారా అలీరెజా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఫిఫా 2022లో తన కీపింగ్ నైపుణ్యాలతో ఆకట్టుకున్న అతడు తాజా వరల్డ్ కప్‌లోనూ సత్తా చాటుతున్నాడు. గోల్‌కీపర్‌గా అత్యంత దూరం బంతిని విసిరిన రికార్డుతో పాటు మరికొన్ని రికార్డులు కూడా అలీరెజా పేరిట ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.