
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా? లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికర అంశమే.
Jun 23 2026 1:26 PM | Updated on Jun 23 2026 1:30 PM
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురించి తెలుగు ప్రజలు ఏమనుకోవాలి? మంచి జ్ఞాని ఆయనలో ఉన్నారనుకోవాలా? లేక అవగాహన లేకుండా మాట్లాడుతుంటారనుకోవాలా? నిజంగా ఇది ఆసక్తికర అంశమే. కొద్ది రోజుల క్రితం ఆయన సుమతీ శతకంలోని ఒక పద్య భాగాన్ని ఉటంకించి భాష్యం చెప్పిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో కూడా ఆయన పరిజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ పలు ప్రశ్నలు వెలువెత్తాయి. ఒకప్పుడు యువత అంతా ప్రశ్నించాలని ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే యువత ప్రభుత్వాల అక్రమాలను ప్రశ్నించడాన్ని తప్పుపడుతూ వారిని క్రిములతో, చీమలతో పోల్చడం దారుణంగా ఉంది.
ఢిల్లీలో ఆయన జనసేన నేతలతో ఒక సమావేశం పెట్టి చేసిన ఉపన్యాసం లాఫింగ్ స్టాక్‌గా మారింది. ఆయన ప్రసంగాన్ని గమనించండి.. ఈ మధ్య చూస్తున్నారు.. కాక్రోచ్ అనే పాయింట్ గురించి. చాలా చిన్నగా కనిపించే క్రిమి కీటకాలు కూడా, చిన్న చీమలు కూడా బలవంతమైన సర్పాలను చంపేస్తాయి.. కోట్ల మంది చిన్న, చిన్న ఆలోచనలు, ఇండివిడ్యువల్ వక్తులు అందరూ కూర్చుని దేశం తాలూకూ ఘాడతను, దేశం తాలూకూ తీవ్రతను అర్థం చేసుకోకపోతే, దేశ సమగ్రతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. డివిజివ్ శక్తులు విభజనవాదాన్ని సృష్టిస్తున్నాయి. దానిలో మనం భాగస్వామ్యులు కారాదు. ఎదిరించి పోరాడాలి.. అంటూ ఆయన ఉపన్యసించారు.
అసలు సుమతీ శతక కారుడు ఈ పద్యం చెప్పడంలో అర్థం వేరు. 'బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదె సుమతీ!' అన్నది ఆ పద్య వ్యాక్యం. దీని అర్థాన్ని గూగుల్‌లో వెతికితే ఏమి ఉందో చూడండి. 'ఈ పద్యం ద్వారా కవి చెప్పిన సారాంశం ఏమిటంటే: తనను మించిన బలవంతుడు లేడని గర్వించి, ఇతరులను చిన్నచూపు చూస్తూ విరోధాలు కొనితెచ్చుకోవడం మంచిది కాదు. బలమైన పామును కూడా చిన్న చీమలు కలిసి కుట్టి చంపగలవు. ఎంతటి బలవంతులకైనా ఐక్యత ముందు ఓటమి తప్పదు. బలవంతమైన సర్పాన్ని చలిచీమలు చంపుతాయి' అని అర్థం. అంతేకాని సర్పం గొప్పదని, దానిని చీమలు చంపడం కరెక్టు కాదని కాదు. ఇది నెగిటివ్ సెన్స్‌లో రాసిన పద్యం.
పవన్ తనకు తెలియకుండా కేంద్రాన్ని దేనితో పోల్చుతున్నారన్న సందేహం వచ్చింది. ఇది అవగాహనారాహిత్యంగా కనిపిస్తుంది. అలాగే కాక్రోచ్ పేరుతో పోరాడిన యువతను చలిచీమలుగా ఆయన చెబుతున్నారన్నమాట. పాము అంటే విషం సర్పం అని గుర్తుంచుకోవాలి. బలంతో విర్రవీగితే చిన్న, చిన్న కాక్రోచ్లు కూడా రేపటి రోజు చుట్టుముట్టి అంతం చేస్తాయని చెప్పడం. రాజకీయాలలో ఎప్పుడు ఏమైనా జరగవచ్చని చరిత్ర చెబుతోంది. ప్రభుత్వాలు తమ తప్పులను తెలుసుకుని జాగ్రత్తపడకపోతే తదుపరి ఎన్నికలలో ఓటమికి గురి కావల్సివస్తుందని అర్థం.
కొన్నాళ్ల క్రితం కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో యువకులు చేసిన పోరాటాన్ని తప్పుపట్టాలని ఆయన భావించడమే దారుణం. అందులో కూడా విష సర్పాన్ని సమర్ధించేలా ఆ పద్యాన్ని అవగాహన చేసుకోవడం మరీ చిత్రం. ఆయనకు ఈ స్క్రిప్ట్ రాసినవారికి ఈ విషయం తెలియదా, ఇది సెల్ఫ్ గోల్ వేసుకోవడం కాక ఏమిటి? అని ఒక మహిళా నెటిజన్ వ్యాఖ్యానించారు. విభజన వాదాన్ని ఎవరు ప్రోత్సహిస్తున్నారు? ఐ యామ్ అన్ అపాలజిటిక్ హిందూ అని, కులం, మతం ప్రస్తావనలు తెచ్చిందెవరు అని ఆమె ప్రశ్నించారు. ఈ దేశం కోసం పోరాడే హక్కు యువతకు ఉంది. వాళ్ల హక్కుల కోసం, జరిగిన అన్యాయాలపై పోరాడుతున్నారు. అది వారి హక్కు అని గుర్తించకుండా పవన్ ఈ మీటింగ్ పెట్టడం ఏమిటో, ఈ విష సర్పం, చలిచీమల గురించి అర్థం, పర్దం లేకుండా మాట్లాడడమేమిటో అని మేధావులు, పండితులు ఆశ్చర్యపోతున్నారు.
నీట్ పరీక్ష లీక్ అవడం వల్ల లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఈ విషయాన్ని అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. సీబీఐ విచారణకు అప్పగించింది. పలువురు ఈ కేసులో అరెస్టు కూడా అయ్యారు. కాకపోతే మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను రాజీనామా చేయాలని అడుగుతున్నారు. ఇందులో రాజకీయం ఎక్కడ ఉంది. ఈ యువత దేశానికి ఏ రకంగా ప్రమాదం?, పవన్ ది రాజును మించి రాజభక్తి ప్రదర్శించడమా? లేక విషయంపై అవగాహన లేకుండా మాట్లాడడమని అనుకోవాలా? ఈ ప్రశ్నలు సహజంగానే బుద్ధి జీవులకు వచ్చాయి.
సినిమాలలో వచ్చిన అవకాశాలతో పాటు, కాపు సామాజికవర్గాన్ని ఆకర్షించడం ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన పవన్ కళ్యాణ్ గత పదేళ్లలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారో చెప్పలేం. ఈయన పరస్పర విరుద్ధమైన డైలాగులు అన్నిటినీ ఒక చోట పేర్చి సోషల్ మీడియాలో ఎవరో పోస్టు చేశారు. తనకు మాత్రమే దేశ భక్తి ఉన్నట్లు, అన్యాయాలను ప్రశ్నించే వారికి లేనట్లుగా పవన్ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు గురైంది. తోచీ, తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్లిందని సామెత. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో ఢిల్లీలో మీటింగ్ పెట్టి ఈ ఉపదేశాలు ఇవ్వడం ఏమిటి? ఇదే పవన్ కళ్యాణ్ అంతకు కొద్ది రోజుల ముందు తన పార్టీ పక్షాన సేనాదళం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
జన్ జి ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే దాని లక్ష్యం అని కూడా ఆయన చెప్పారు. అది చెప్పిన కొద్ది రోజులకే మాట మార్చేశారు. కొందరు యువకులు ప్రకటించిన ఈ కాక్రోచ్ జనతా పార్టీని జన్ జి లో భాగంగానే చూడాలి. దీని అర్థం ఎంత అణచివేతకు గురి అవుతున్నా బొద్దింకల మాదిరి తిరగబడాలని చెప్పడం అన్నమాట. దీని గురించి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా ఒక వ్యాఖ్య చేస్తూ యువత తన ఆకాంక్షల కోసం ఈ ప్రయత్నం చేస్తోందని అన్నారు. ఏపీలో తాను కూడా ఒక కాక్రోచ్‌నే అని కామెంట్ చేశారు. అంటే దాని భావం ఏపీలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై తాను పోరాడతానని ప్రకటించడమే కదా!
రాజకీయాలలో కొందరు వ్యక్తుల తప్పులను వ్యక్తిగత చర్యలుగా కాకుండా వారి కులం, మతం, వర్గాలకు ముడిపెట్టి సామాజిక విభేధాలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నారని కూడా పవన్ కళ్యాణ్ సేనాదళం ప్రకటన సందర్భంలో అన్నారు. విశేషం ఏమిటంటే జగన్ పాలన సాగిన ఐదేళ్లలో ఈ రకమైన ప్రయత్నాలు చేసిందంతా టీడీపీ, జనసేనలే. అధికారం కోసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు కలిసి ఎన్నిసార్లు కుల విభేధాలు, మత వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నించారో తెలియదా? అధికారంలోకి వచ్చాక కూడా తిరుమల లడ్డూ పేరుతో, ఇతరత్రా మతపరమైన అంశాలను ఏ విధంగా వాడుకున్నది ఆయనకు గుర్తు లేకపోవచ్చు. కాని సోషల్ మీడియాలో ఆ చరిత్ర అంతా ప్రత్యక్షమవుతూనే ఉంది కదా!
కొద్ది రోజుల క్రితం వరంగల్‌లో ఒక బాలుడి కోరిక ప్రకారం అతనిని కలిసి వచ్చారు. మంచిదే. దానిని స్వాగతించవచ్చు. కాని అదే సమయంలో ఏపీలో తన మద్దతుదారుడైన ఒక యువకుడిని పోలీసులు క్రూరంగా హింసించి చంపేసి, చివరికి కాల్చి బూడిద చేశారన్న అభియోగం వస్తే, ఆ కుటుంబాన్ని పలకరించడానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇలాంటి ఘటనలపై కూడా యువత కాని, ప్రజలు కాని స్పందించరాదన్నది ఆయన ఉద్దేశమా? అధికారం వచ్చింది కనుక ఆయనకు సంతోషంగానే ఉండవచ్చు. కాని ప్రజలకు ఏమి ఒరిగింది? ఈ నేపథ్యంలోనే రెడ్ బుక్ అరాచకాలతో ఏపీ అల్లాడుతుంటే ప్రశ్నించలేని పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయితే ఏమిటి? కాకపోతే ఏమిటి? అన్న నైరాశ్యానికి ఆయన మద్దతుదారులు గురి అవుతున్నారనిపిస్తుంది.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
లేటు వయసులోనూ మరింత అందంగా హీరోయిన్ (ఫొటోలు)
నాగదుర్గ.. యూట్యూబ్ సాంగ్స్ నుంచి హీరోయిన్ ఛాన్స్‌ల వరకు (ఫొటోలు)
హైదరాబాద్ : అర్ధనారీశ్వరం..అద్భుతం (ఫొటోలు)
వైష్ణవిని పెళ్లి చేసుకున్న 'బిగ్‌బాస్' షణ్ముఖ్ జస్వంత్ (ఫొటోలు)
దళిత మహిళ గంగమ్మ మృతిపై హైకోర్టులో విచారణ
పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం ఇద్దరు సజీవదహనం
సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్, సీసీ పుటేజ్ మాయం ఎందుకు చేసారంటే ..!