
ఇంటర్నెట్ డెస్క్: ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్‌లకు టీమ్ఇండియా సిద్ధమవుతోన్న వేళ ఆటగాళ్ల గాయాల బెడద జట్టును వెంటాడుతోంది. ఇప్పటికే మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీ20 జట్టు నుంచి వైదొలగగా..
తాజాగా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కూడా దూరమయ్యాడు. తొడ కండరాల గాయం కారణంగా ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అతడు అందుబాటులో ఉండడని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. (IND VS IRE T20 Series)
అఫ్గాన్‌తో వన్డే సిరీస్ ఆడుతుండగా నితీశ్ గాయపడిన సంగతి తెలిసిందే. తొలుత చిన్న దెబ్బే అనిపించినా.. ఎమ్మారైలో తొడ కండరాలకు గాయమైనట్లు తెలిసింది. అతడు కోలుకునేందుకు కనీసం నాలుగు వారాల సమయం పడుతుందని వైద్యులు వెల్లడించారు. ఆ తర్వాత కూడా ఫిట్నెస్ నిరూపించుకునేందుకు మరికొంత సమయం అవసరం. దీంతో ఐర్లాండ్ (Ireland)తో సిరీస్‌కు అతడిని జట్టు నుంచి తొలగించారు. ఇంగ్లాండ్ (England)తో సిరీస్‌కు కూడా నితీశ్ అందుబాటులో ఉండే అవకాశం కన్పించట్లేదు.
జూన్ 26-28 మధ్య ఐర్లాండ్‌తో టీమ్ఇండియా (Team India) రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. ఆ తర్వాత జులై 1 - 11 మధ్య ఇంగ్లాండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జరగనుంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు కూడా నితీశ్ ఎంపికయ్యాడు. అందులోనూ అతడు ఆడటం అనుమానమే. కాగా.. ఐర్లాండ్‌తో సిరీస్‌కు నితీశ్ స్థానంలో సూర్యాంశ్ షెడ్జెను ఎంపిక చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల శ్రీలంక-ఎతో జరిగిన మ్యాచ్‌ల్లో సూర్యాంశ్ అద్భుత ప్రదర్శన నమోదు చేశాడు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.