
వృత్తిరీత్యా వైద్యురాలు ఆమె. అలానే ఉండిపోతే డా.ఎమ్.ఎస్ లక్ష్మీ ప్రియ సేవలు ఆరోగ్య వ్యవస్థకే పరిమితం అయ్యేవేమో. కానీ అన్ని రంగాల్లోనూ ఆమె సేవలందించాలని కలలు కన్నారు. సివిల్స్ సాధించి...
వృత్తిరీత్యా వైద్యురాలు ఆమె. అలానే ఉండిపోతే డా.ఎమ్.ఎస్ లక్ష్మీ ప్రియ సేవలు ఆరోగ్య వ్యవస్థకే పరిమితం అయ్యేవేమో. కానీ అన్ని రంగాల్లోనూ ఆమె సేవలందించాలని కలలు కన్నారు. సివిల్స్ సాధించి... ఐఏఎస్ హోదాలో ఆమె తీసుకొచ్చిన మార్పులు ప్రధాన మంత్రి ప్రశంసలకు కారణమయ్యాయి.
అది 2012... తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్ డ్యూటీలో విధులు నిర్వర్తిస్తున్నారు లక్ష్మీ ప్రియ. పిల్లల్ని అపహరించే ముఠాల హల్చల్ ఎక్కువగా ఉన్న రోజులవి. అలాంటి గ్యాంగ్ లక్ష్మీ ప్రియకు తారస పడింది. వెంటనే అలర్ట్ అయ్యి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లల్ని కాపాడారు. ఆ ఘటనే ఆమె ఐఏఎస్ కావడానికి కారణమైంది. ‘ఇలాంటి సామాజిక అన్యాయాల్ని ఎదురించాలంటే వైద్యురాలిగా ఉంటే సరిపోదు అనిపించింది. అందుకే పాలనా విభాగంలో భాగం అవ్వాలనుకున్నా. ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అంటూ అందరూ వెనక్కిలాగే ప్రయత్నాలు చాలానే చేశారు’ అని గుర్తుచేసుకుంటారు లక్ష్మి. ఈ లక్ష్యాన్ని సాధించడం కోసం ఆమె చేసిన త్యాగాలు చాలానే. అదే సంవత్సరం ఆమెకు ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డీఫిల్ ఫెలోషిప్ చేసే అవకాశమూ వచ్చింది. కానీ స్వదేశంలో సేవ చేయాలనే ఉద్దేశంతో దాన్ని వదులుకున్నారామె. ఈమెది కేరళ. వైద్య వృత్తిని కొనసాగిస్తూనే యూపీఎస్సీకి సన్నద్ధం అయ్యారు. మూడుసార్లు అపజయాల్ని చవిచూశారు. అయినా వెనకడుగువేయకుండా ప్రయత్నించి అనుకున్నది సాధించారు.
మొదటి పోస్టింగ్ అసోంలోని జోర్హాట్ జిల్లా. టీ ఎస్టేట్లకు ప్రసిద్ధి. అన్నీ మహిళల శక్తిసామర్థ్యాల మీద ఆధారపడి నడిచేవే. అలాంటి మహిళలే పోషకాహార లోపం, రక్తహీనతతో బాధపడటం గమనించారామె. దీనివల్ల ప్రసవ సమయంలో మరణాల రేటు అధికంగా ఉండేది. దీన్ని అరికట్టడానికి ‘స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్’ సహాయంతో పౌష్టికాహారాన్ని అందించే ‘బగన్ బజార్’లను ఏర్పాటుచేశారు. ‘దీనిద్వారా న్యూట్రిషన్ సమస్యలతో బాధపడుతున్న మహిళలకు, పిల్లలకు తక్కువ ధరకే అవసరమైన ఆహారాన్ని ఇవ్వడం మొదలుపెట్టాం. మంచి ఫలితాల్నే అందుకున్నాం. ఈలోగా నాకు బొంగైగావ్కు బదిలీ అయ్యింది. అప్పటికి నేను గర్భిణిని. ఇక్కడా అదే సమస్య. రాష్ట్రవ్యాప్తంగా ప్రసూతి మరణాల రేటు 195గా ఉండేది’ అని చెప్పే లక్ష్మీ ప్రియ దాన్ని తగ్గించడమే తక్షణ కర్తవ్యంగా భావించారు. ఈ క్రమంలో విశ్రాంతికీ చోటివ్వలేదు. ‘బిడ్డల్ని పోగొట్టుకుని బాధపడుతున్న తల్లుల శోకం... తల్లి కాబోతున్న నేను తప్ప ఇంకెవరు అర్థం చేసుకుంటారు’ అంటారామె.
2020లో ‘ప్రాజెక్ట్ సంపూర్ణ’ను ప్రారంభించారీమె. తల్లీ బిడ్డా క్షేమం దీని ప్రాథమిక లక్ష్యం. పోషకాహార లోపంతో బాధపడుతున్న పిల్లల్నీ దీన్లో చేర్చారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు, ఆశావర్కర్ల సహాయం తీసుకున్నారు. ‘ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే తల్లుల్ని పరీక్షించగలరు. కానీ వాళ్ల సమస్యలకు సమాధానం చెబుతూ ఏది, ఎప్పుడు, ఎలా తినాలో నిత్యం సూచించే ఒక నెట్వర్క్ ఉంటే బాగుంటుంది అనిపించింది. ఆ ఆలోచన నుంచి వచ్చినదే ‘బడ్డీ మదర్’. దీనిలో ఒక ఆరోగ్యకరమైన తల్లికి, సమస్యలతో సతమతం అవుతున్న ఇంకో తల్లిని జోడిస్తారు. తమ ఆహారపు అలవాట్లని ఇద్దరూ పంచుకుంటారు. మార్పులూ చేర్పులూ చేసుకుంటారు. సమస్యల్ని తెలుసుకుని పరిష్కారాల కోసం కృషిచేస్తారు. వాళ్లకీ అవగాహన లేకపోతే... నిపుణుల్ని సంప్రదిస్తారు. ఏడాదిలోనే క్షేత్రస్థాయిలో బాగా విజయం సాధించిందీ కాన్సెప్ట్. ప్రసూతి మరణాల రేటు 84కి వచ్చింది’ అని చెప్పే లక్ష్మీ ప్రియ... ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలతోపాటు, ‘ఎక్సలెన్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ అవార్డునీ అందుకున్నారు. ప్రస్తుతం ఇదే ప్రాజెక్టు దేశవ్యాప్తంగా అందుబాటులోకీ వచ్చింది. ఈమె అందిస్తోన్న సేవలు అభినందనీయమే కదూ!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.