
సమంత నటించి, నిర్మించిన 'మా ఇంటి బంగారం' నాలుగు రోజుల్లో రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇదిలా ఉంటే ఈ కథను నందినీ రెడ్డి తొలుత సాయిపల్లవికి వినిపించిందనే వార్తలు వస్తున్నాయి.
తెలుగులో లేడీ ఓరియంటెడ్ మూవీస్ సక్సెస్ అయ్యి చాలా రోజులైంది. ఆ లోటును సమంత తాజా చిత్రం 'మా ఇంటి బంగారం' తీర్చేసింది. కేవలం నాలుగు రోజుల్లో ఈ సినిమా వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. జూన్ ఫస్ట్ వీకెండ్ వచ్చిన 'పెద్ది' విజయాన్ని కంటిన్యూ చేస్తూ... ఆ తర్వాత వారం వచ్చిన 'సింగ్ గీతం' మంచి చిత్రంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. భారీ విజయాన్ని సాధించకపోయినా... ఓ గౌరవ ప్రదమైన స్పందనను పొందింది. ఇక ఈ నెల థర్డ్ వీకెండ్లో వచ్చిన 'మా ఇంటి బంగారం' విజయపథంలో సాగడంతో టాలీవుడ్ ఊపిరి పీల్చుకుంటోంది.
ఈ యేడాది సంక్రాంతి సీజన్లో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సాధించి, శుభారంభాన్ని ఇచ్చినా... ఆ తర్వాత మాసాల్లో ఆ స్థాయి విజయాన్ని మరే సినిమా అందుకోలేదు. 'పెద్ది' రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయగా, మీడియం బడ్జెట్ లో రూపుదిద్దుకున్న 'మా ఇంటి బంగారం' ఇప్పుడు రూ. 50 కోట్ల గ్రాస్‌ను వసూలు చేయడం పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం 'శుభం' గత యేడాది మేలో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. ఈ యేడాది ఆమె నిర్మించి, కథానాయికగా నటించిన 'మా ఇంటి బంగారం' సైతం చక్కని విజయాన్ని అందుకోవడంతో నిర్మాతగా సమంతది లక్కీ హ్యాండ్ అనే మాట టాలీవుడ్ లో వినిపిస్తోంది. తెలుగువారికి బంగారం లాంటి సినిమాను అందించిన సమంత... ప్రెగ్నెంట్ కూడా అని తెలియడంతో ఆమె అభిమానులు సమంత, రాజ్ దంపతులకు ఇది డబుల్ థమాకా అంటూ అభివర్ణిస్తున్నారు.
సమంత 'మా ఇంటి బంగారం' చిత్రం విజయపథంతో సాగిపోతుంటే... మరోపక్క ఈ సినిమా కథను నందినీ రెడ్డి తొలుత సాయిపల్లవికి చెప్పారని, అప్పుడు ఆమె 'కోడలు' పేరుతో ఈ కథను తయారు చేసుకున్నారనే ప్రచారం ఒకటి జరుగుతోంది. మరికొందరైతే... 'శుభం' తరహాలోనే సమంత... ఈ సినిమాలో తాను నటించకుండా సాయిపల్లవితో తీయాలనుకున్నారని కూడా చెబుతున్నారు. నిజానికి సమంత మొదటి నుంచి 'మా ఇంటి బంగారం'లో తానే నటించాలని అనుకుంది. ఈ సినిమాలోకి నందినీరెడ్డి తర్వాత వచ్చి చేరింది. అలానే ఈ కథను నందినీరెడ్డి కాకుండా సమంత భర్త రాజ్ నిడిమోరు రాశారు. కాబట్టి నందినీ రెడ్డి 'మా ఇంటి బంగారం' కథను తొలుత సాయిపల్లవికి చెప్పిందనే వాదనలో బలం లేదు. ఏదేమైనా ఈ విషయంలో స్పష్టమైన వివరణ ఇవ్వగలిగేది నందినీరెడ్డి, సమంత నే! కానీ వారు పెదవి విప్పనంత వరకూ ఈ రకమైన పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తూనే ఉంటాయి.
సమంత ప్రెగ్నెంట్ అని రివీల్ చేసిన చిరంజీవి.. ట్వీట్ వైరల్!
కృష్ణవేణి నుంచి నిహారిక, సమంత వరకు... నిర్మాతలుగా మారిన నటీమణులు వీరే!
ఆ ప్రకటనలను నమ్మవద్దు: ‘వెంకీఅనిల్5’ టీమ్ హెచ్చరిక