
బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్నారా? కొద్ది రోజులుగా ఆకాశాన్ని తాకిన గోల్డ్ రేట్స్ ఒక్కసారిగా పతనమయ్యాయి. వేల రూపాయల తగ్గుదలతో కొనుగోలుదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అసలు ఈ భారీ పతనం వెనుక కారణాలేంటి?
ప్రస్తుతం హైదరాబాద్‌లో బంగారం, వెండి ధరలు ఎంత ఉన్నాయి?
దేశీయ బులియన్ మార్కెట్లో ఈరోజు గోల్డ్ రేట్స్ భారీగా తగ్గాయి. ముఖ్యంగా హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరలో గణనీయమైన తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,45,910 వద్ద కొనసాగుతోంది. గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే ఇది రూ.2,070 తగ్గింది.
అలాగే ఆభరణాల తయారీలో ఎక్కువగా ఉపయోగించే 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ ప్రస్తుతం రూ.1,33,750 వద్ద అందుబాటులో ఉంది. ఈ విభాగంలో ధర రూ.1,900 మేర తగ్గడంతో పెళ్లిళ్లు, శుభకార్యాల కోసం నగలు కొనుగోలు చేయాలనుకునే కుటుంబాలకు ఇది కొంత ఉపశమనంగా మారింది.
ఇక వెండి విషయానికి వస్తే.. బంగారం కంటే ఎక్కువగా ధర పడిపోయింది. కిలో వెండి ధర ఏకంగా రూ.5,000 మేర తగ్గి ప్రస్తుతం రూ.2.50 లక్షల వద్ద ట్రేడవుతోంది. ఇటీవల వరుసగా పెరిగిన వెండి ధరలు కొనుగోలుదారుల్లో ఆందోళన కలిగించగా, తాజా తగ్గుదల కొంత ఊరటనిస్తోంది.
మార్కెట్ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్లలో లాభాల స్వీకరణ, డాలర్ ఇండెక్స్‌లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారుల వ్యూహాల్లో జరిగిన మార్పులు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలు కూడా విలువైన లోహాల ధరలను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలుగా చెబుతున్నారు.
అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. నగరాన్ని బట్టి, జ్యువెలరీ షాపును బట్టి ధరల్లో స్వల్ప తేడాలు ఉండవచ్చు. స్థానిక పన్నులు, మేకింగ్ ఛార్జీలు, ఇతర వ్యయాల కారణంగా తుది ధర మారే అవకాశం ఉంటుంది. కాబట్టి కొనుగోలు ముందు మీ ప్రాంతంలోని జ్యువెలరీ షాపులో తాజా రేట్లను ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది.