
పెరియార్ రామస్వామి సామాజిక సిద్ధాంతాలను తాము స్వీకరించినప్పటికీ, ఆయన నాస్తికత్వ భావజాలాన్ని అంగీకరించలేదని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ స్పష్టం చేశారు.
తాము దేవుడిని విశ్వసిస్తామని, ఈ విషయాన్ని ఎప్పుడూ దాచలేదని చెప్పారు.గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై అసెంబ్లీలో మాట్లాడిన విజయ్ తమ ప్రభుత్వానికి పెరియార్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మాజీ సీఎం కామరాజ్ సిద్ధాంతాలే స్ఫూర్తి అని పేర్కొన్నారు. సమాన అవకాశాలు, సామాజిక న్యాయంపై అంబేడ్కర్ ఆలోచనలను స్వీకరించామని తెలిపారు. నిజాయతీతో కూడిన పాలన విషయంలో కామరాజ్‌ను ఆదర్శంగా తీసుకున్నామని చెప్పారు.2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఎలాంటి పొత్తులు లేకుండానే పోటీ చేసి 35 శాతం ఓట్లు సాధించిందని విజయ్ తెలిపారు. 1.72 కోట్ల ఓట్లు పొందిన తమ పార్టీ స్వతంత్ర రాజకీయ శక్తిగా ఎదిగిందని అన్నారు. ముందుగా ప్రజల వద్దకు వెళ్లి వారి మద్దతు సంపాదించాకే పార్టీని ఏర్పాటు చేశామని చెప్పారు.రాజకీయ ప్రత్యర్థులు, భావజాల ప్రత్యర్థుల మధ్య తాము స్పష్టమైన తేడా పాటిస్తున్నామని విజయ్ పేర్కొన్నారు. తమ పార్టీని కేవలం సినీ నటుడి పార్టీగా అభివర్ణించే వారు దాని ఎదుగుదలను అర్థం చేసుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. 2026 ఎన్నికల్లో మతం, కులం అనే గోడలను చెరిపేసి ప్రజల మద్దతు పొందామని చెప్పారు.గత ప్రభుత్వం పార్టీ నిధుల పేరుతో భారీ అవినీతికి పాల్పడిందని విజయ్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై డీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. వామపక్ష పార్టీలు తమ కూటమిలో స్వచ్ఛందంగానే చేరాయని, ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదని విజయ్ వ్యాఖ్యానించారు.