
పుస్తకాల బరువుతో వంగిపోతున్న చిన్నారులు అమలుకు నోచుకోని విద్యాహక్కు చట్టం వాంకిడి(కుమరం భీం): బాల్యంపై భారం పెరిగి పోతోంది. వారిని పుస్తకాల బరువు కుంగదీస్తొంది.
కిలోల కొద్ది బరువును వీపుపై మోస్తూ అనారోగ్యం భారిన పడాల్సి వస్తోంది. పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు తమ లాభాపేక్ష కోసం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయి. విద్యాహక్కు చట్టాన్ని తుంగలో తొక్కుతూ ఇష్టారాజ్యంగా వ్యవహారిస్తున్నాయి. అవసరం లేని, అర్హతకు మించిన పుస్తకాలను కొనుగోలు చేయించి విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నాయి. వాస్త వానికి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థులకు అసలు పుస్తకాలు ఉండొద్దని చట్టం పేర్కొంటుంది. కానీ ఈ నిబంధనలేవి అమలవడంలేదు. అంతేనా పలు ప్రైవేటు పాఠశాలలు పుణ్యమా అని ఒకటి రెండు తరగతుల విద్యార్థులే 30 నుంచి 45 పుస్త కాలను మోస్తున్నారు. వాస్తవానికి విద్యార్థి బరువులో 10 శాతం మాత్రమే పుస్తకాల బరువు ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోంది. పుస్తకాలు పాఠశాలల్లో ఉంచుకునేలా ర్యాక్బాగులు లేదంటే లాకర్లు సదుపాయం ఏర్పాటు చేయాలని ఉన్నా అది కేవలం కొన్ని పాఠశాలలకే పరిమితమైంది. విద్యార్థులకు తరగతి గదులే సరి పడాలేని పలు పాఠశాలల్లో ఇక లాకర్ల సదుపాయం ఎక్కడ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. కానీ ఇలాంటి పాఠశాలలను అధికారులు పట్టించకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మారిన ఫ్యాషన్ పోకడలను అనుసరించి విద్యార్థులు నడుం కిందకు బ్యాగు వేసుకుంటున్నారు. ఇలా వేసుకోవడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసిన ప్రభుత్వం పది బ్యాగ్‌లెస్ డేస్‌ను నిర్వ హించాలని, నెలలో ప్రతీ మూడో శనివారం నో బ్యాగ్ డేగా పాటించాలని నిర్ణయం తీసుకుంది. అవసరం లేని పుస్తకాలతో అధికభారం... ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆరు సబ్జెక్టులకు సంబంధించి ఆరు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు ఉంటాయి. కానీ ప్రైవేటు పాఠశాలల్లో మాత్రం అందకు విరుద్ధంగా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని మోపుతూ ఒకటి రెండు తరగతులు చదివే విద్యార్థులకు 10 నుంచి 15 పుస్తకాలు, ఒక్కో సబ్జెక్టుకు తరగతి వర్క్ బుక్, హోంవర్క్, ప్రాజెక్టు పని ఇలా మూడేసి పుస్తకాలు కొనుక్కోవాలని చెబుతున్నారు. పుస్తకాలు, నోట్ బుక్కులు, మొత్తం 30 నుంచి 45 పుస్తకాలు అవుతుండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని పాఠశాలలు ఎక్స్ట్రా కరిక్యులమ్ పేరుతో పలు పబ్లికేషన్స్ రూపొందించిన పాఠ్యపుస్తకాలు కొనుగోలు చేయిస్తున్నాయి. వీటికి లంచ్ బాక్స్, వాటర్‌బాటిల్ తోడవడంతో నాలుగు నుంచి ఆరు కిలోల బరువవుతోంది. ఈ మోత బాల్యానికి భారం అవుతోంది. దాంతో చిన్నారుల వెన్ను చిన్నవయస్సులోనే వంగిపోతుంది. కాగా అవసరం లేని పుస్తకాలను పక్కన బెట్టి అవసరం ఉన్న పుస్తకాలను వాడుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. అత్యధిక భారం వెన్నెముకపై పడి అది దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇప్పటికే చాలామంది పిల్లలు వంగినడుస్తున్నారన్న అంశం పలు అధ్యయనాల్లో వెల్లడైంది. చిన్న వయస్సులో వెన్నెముకపై సామర్థ్యాన్ని మించి భారం వేయడంవల్ల అనేక సమస్యలు వస్తాయని, వెన్నెముక, మెడనొప్పులు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో ప్ర త్యేకంగా ర్యాక్‌లు ఏర్పాటు చేసి హోంవర్క్ కోసం ఉపయోగించే పుస్తకాలనే ఇంటికి పంపించే విధంగా ఏర్పాట్లు చేసినా... అవి కొన్ని పా ఠశాలలకే పరిమితమయ్యాయన్న ఆరోపణలున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం తీసుకున్న నోబ్యాగ్ డే నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలలు ఏ స్థాయిలో అమలు చేస్తాయో వేచి చూడాల్సి ఉంది. విద్యాహక్కు చట్టం ఏం చెబుతోంది.. నర్సరీ, ఎల్కేజీ, యుకేజీ విద్యార్థులు అస లు స్కూలు బ్యాగులే మోయకూడదు. ఆపై తరగతుల విద్యార్థులు శరీర బరువుకంటే 10 శాతం మించి బరువును మోయకూడదు. విద్యార్థి పాఠశాలకు రోజూ తెచ్చుకోవాల్సిన పుస్తకాలపై శాస్త్రీయ అంచనాలతో విద్యార్థుల తల్లిదండ్రులకు మార్గదర్శకాలు ఇవ్వాలి. ప్రభుత్వ పాఠశాలల్లో పుస్తకాలను దాచు కునేందుకు తరగతి గదుల్లో ప్రత్యేకంగా ఏర్పా ట్లు చేయాలి. ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సరిపడా లాకర్లు, డెస్క్‌లను ఏర్పాటు చేయాలి. లేని పక్షంలో నిబంధనల ప్రకా రం పాఠశాలపై చర్యలు తీసుకునే హక్కు విద్యాశాఖకు ఉంది. పాఠశాల గుర్తింపు రద్దుతో పాటుగా మూడు లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. విద్యార్థులు ఈ జాగ్రత్తలు పాటించాలి మందం ఎక్కువ ఉన్న పుస్తకాలను వీపునకు ఆనుకునేలా సర్దుకోవాలి. తక్కువ మందం ఉన్న పుస్త కాలను అమర్చుకోవడం వల్ల వెన్నెముకపై బరువు ఎక్కువగా పడే ప్రమాదం ఉంది. విద్యార్థులు బ్యాగును ఒక భూజానికి కాకుండా రెండు భూజాలకు తగిలించుకోవాలి. ఫ్యాషన్ పోకడలను అనుసరించి నడుం కిందకు బ్యాగులను వేసుకోవద్దు. అలాచేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నడుము పైవరకు బ్యాగు ఉండేలా చూసుకోవాలి. శరీర బరువులో పదోవంతు మాత్రమే పు స్తకాల బరువుండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకోవడం, రాసుకోవడమే కాకుండా రోజుకు కనీసం గంటన్నరపాటు ఆటలు ఆడాలి. అప్పుడు వెన్నెముక కూడా బలంగా ఉంటుంది. బరువున్న స్కూల్ బ్యాగులు మోయడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. పిల్లల బరువులో 10 శాతం మించి బరువు ఉండకూడదు. అధిక బరువున్న బ్యాగులు మోయడం వల్ల వెన్నునొప్పి, భుజాలపై ఒత్తిడి మెడనొప్పి శరీర భంగిమ, నడకలో మార్పులు, కండరాల అలసట లాంటి అనారోగ్య సమ స్యలు తలెత్తుతాయి. అవి దీర్ఘకాలిక సమస్యలుగా కూడా మార వచ్చు. చిన్న వయసులోనే తరచుగా వెన్నునొప్పి వచ్చే అవకాశం ఉంది. బ్యాగ్‌ను ధరించేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకుంటే కొంతమేర పిల్లలకు ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది. ఈ వార్తలు కూడా చదవండి: ఢిల్లీలో రేవంత్ బిజీబిజీ.. కిషన్‌రెడ్డితో కలిసి కేంద్ర మంత్రి ఖట్టర్‌తో సమావేశం మహబూబాబాద్ జిల్లాలో మొసలి కలకలం.. Read Latest AP News And Telangana News And International News And Telugu News