
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Super El Niño: భారత ఆర్థిక వ్యవస్థకు రుతుపవనాలు కీలకం. భారతదేశ వ్యవసాయం, గ్రామీణాభివ్రుద్ధి, ఆహార ధరలు ఎక్కువగా వర్షపాతంపై ఎక్కువగా ఆధారపడుతాయి. అందుకే సూపర్ ఎల్ నినో వంటి వాతావరణ ఘటనలు.. రుతుపవనాలకు అంతరాయం కలిగించినట్లయితే.. దాని ప్రభావం కేవలం వ్యవసాయానికే పరిమితం అవ్వదు. వ్యవసాయ ఉత్పత్తి భారీగా క్షీణించే ప్రమాదం ఉంటుంది. దీంతో ఆర్థిక వృద్ధి అనేది మందగిస్తుంది. సూపర్ ఎల్ నినో గురించి చర్చలు మొదలైనప్పుడల్లా ఆర్థికవేత్తలు, విధాన రూపకర్తలు తీవ్ర ఆందోళన చెందడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అసలు ఈ సూపర్ ఎల్ నినో అంటే ఏమిటి. భారత ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా హాని కలిగిస్తుందో తెలుసుకుందాం.
ఎల్ నినో అంటే ఏంటి? మధ్య, తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే ఆ సమయంలో సంభవించే సహజ వాతావరణమే ఎన్ నినో అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఎల్ నినో ప్రభావం పసిఫిక్ మహాసముద్రానికి కే పరిమితం అవ్వదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం, వర్షాపాతం, ఉష్ణోగ్రత సరళి మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. భారత్ లో ఎల్ నినో రుతుపవనాలను బలహీనంగా మారుస్తుంది. దీంతో సాధారణ కంటే తక్కువగా వర్షపాతం నమోదు అవుతుంది.
ఎల్ నీనో పదం ఎక్కడి నుంచి ఉద్బవించింది? ఎల్ నీనో అనే పదం 1600వ దశకంలో దక్షిణ అమెరికా జాలర్లు మొదటిసారిగా ఉపయోగించారు. స్పానిష్ భాషలో ఎల్ నినో అంటే చిన్న బాలుడు లేదా క్రీస్తు శిశువు అని అర్థం. ఈ ఎల్ నీనో అనేది క్రిస్మస్ పండగ సమయంలో అంటే డిసెంబర్ లో గరిష్ట స్థాయికి చేరుతుంది. ఈ ఎల్ నినో ప్రభావం ప్రతి 2 నుంచి 7 ఏళ్లకోసారి సంభవిస్తుంది. 12 నుంచి 18 నెలల వరకు కొనసాగుతుంది.
ఎల్ నినో ఎలా ఏర్పడుతుంది? పసిఫిక్ మహాసముద్రంపై వీచే వాణిజ్య పవనాలు వెచ్చని నీటిని పశ్చిమ పసిఫిక్ వైపు నెట్టుతాయి. కానీ ఈ పవనాలు బలహీనంగా మారినప్పుడు లేదా దిశ మార్చుకున్న సమయంలో వెచ్చని నీరు మధ్య, తూర్పు పసిఫిక్ లో పేరుకుపోతాయి. ఈ వెచ్చని నీటి చేరడంతో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరిగి.. వాతావరణ పీడనంలో మార్పులు సంభవిస్తాయి. ఇది సాధారణ వాతావరణ సరళికి అంతరాయం కలిగిస్తుంది. ఎల్ నినో సమయంలో అల్పపడీన ప్రాంతం మధ్య పసిఫిక్ వైపునకు మారగా.. పశ్చిమ పసిఫిక్ లో అధిక పీడన పరిస్ధితులు ఏర్పడుతాయి. వాయు పీడనంలో ఈ మార్పును సదరన్ ఆసిలేషన్ అని పిలుస్తారు.
మరి సూపర్ ఎల్ నీనో అంటే ఏంటి? మధ్య-తూర్పు పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే సుమారు 2 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువగా పెరిగి.. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగినప్పుడు దాన్ని సూపర్ ఎల్ నినో అని పిలుస్తారు.
ఇప్పటి వరకు ఎన్ని సూపర్ ఎల్ నినోలు సంభవించాయి? శాస్త్రీయ రికార్డుల ప్రకారం.. గత 75ఏళ్ల కాలంలో 3 ప్రధాన సూపర్ ఎల్ నినో ఘనటలు నమోదు అయ్యాయి. అవి 1982-83, 1997-98, 2015-16 మధ్య కాలంలో సంభవించాయి.
ఇప్పటి వరకు నమోదు అయిన అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో ఎప్పుడు వచ్చింది? రికార్డుల ప్రకారం.. 1997-98 మధ్య ఎల్ నినో అత్యంత శక్తివంతమైన సూపర్ ఎల్ నినో గా నమోదు అయ్యింది. నేషనల్ ఓషియానిక్ అండ్ ఆట్మాస్పియరిక్ అడ్మినిస్ట్రేషన్ లోని వాతావరణ నిపుణులు 1997-98 ఎల్ నినో రికార్డుల్లో అత్యంత పవర్ ఫుల్ అని పేర్కొన్నారు. 2015-16 కూడా దానికి దాదాపుగా సమానంగా నిలిచిందన్నారు.
భారత్ కు ఎల్ నినో అంటే ఎందుకంత భయం? దేశంలోని వ్యవసాయం చాలా వరకు రుతుపవనాలపై ఆధారపడి ఉంటుంది. దేశ వార్షిక వర్షపాతంలో సుమారు 70శాతం నైరుతి రుతుపవనాల నుంచే లభిస్తు్ంది. ఎల్ నినో వల్ల భారత రుతుపవనాలు బలహీనంగా మారుతాయి. దీంతో తీవ్రమైన కరువు ఏర్పడుతుంది. ఈ మధ్యకాలంలో ఇది కాస్త బలహీనపడినప్పటికీ... తాజాగా మరోసారి దాని ప్రభావం భారత్ పై పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
భారత వ్యవసాయానికి ఎంత మేర నష్టం కలుగుతుంది? పీఐబీ కథనం ప్రకారం.. భారత్ లో మొత్తం సాగు విస్తీర్ణంలో సుమారు 60శాతం వర్షధారమైంది. దేశ మొత్తం ఆహారం ఉత్పత్తిలో సుమారు 40శాతం వాటా అందిస్తోంది. బలహీనపడుతున్న రుతుపవనాలు వ్యవసాయంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. ఖరీఫ్ పంటలపై భారీ ప్రభావం ఉంటుంది. వరి, పప్పుధాన్యాలు, మొక్కజొన్న, సోయాబీన్స్, చెరకు, పత్తివంటి పంటలు నష్టపోయే అవకాశం ఉంటుంది. నీటిపారుదల ఖర్చులు పెరిగి.. ఉత్పత్తి తగ్గుతుంది.
భారత ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం? సూపర్ ఎల్ నీనో కారణంగా రుతుపవనాలు బలహీనంగా మారినట్లయితే... దాని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. వ్యవసాయం, తక్కువ వర్షపాత వ్యవసాయ ఉత్పత్తి తగ్గి ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతుంది. వినియోగ వస్తువుల వంటి రంగాల్లో కూడా అమ్మకాలు భారీగా ప్రభావితం అవుతాయి.రైతుల ఆదాయం తగ్గి.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థే.. దేశ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణానికి బలం. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడితే.. దేశానికి ప్రధాన ప్రమాదంగా పరిగణిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.