
AP New Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం .. ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. చేనేత కార్మికుల కోసం నేతన్నకు భరోసా పేరుతో కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనుంది.
ఈ పథకం కింద అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.25 వేల ఆర్థిక సాయం నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే ఆరోగ్య బీమా, ఆధునిక మగ్గాలపై 90 శాతం సబ్సిడీ, కొత్త చేనేత పార్కులు వంటి పలు సంక్షేమ చర్యలను కూడా ప్రభుత్వం అమలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. చేనేత కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు "నేతన్నకు భరోసా" అనే కొత్త పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం ద్వారా అర్హులైన ప్రతి చేనేత కుటుంబానికి సంవత్సరానికి రూ.25 వేల ఆర్థిక సహాయం అందించనున్నారు.
చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సాయం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని, త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు కూడా చేపడుతోంది. ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే నేతన్నల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పథకాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. దీనివల్ల వైద్య ఖర్చుల భారం కొంతవరకు తగ్గే అవకాశం ఉంది.
ఇక చేనేత రంగ అభివృద్ధికి సంబంధించి మరో కీలక ప్రకటన కూడా చేశారు. అమరావతిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) కేంద్రం ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని వెల్లడించారు. అలాగే హస్తకళల మ్యూజియం ఏర్పాటు కోసం కూడా ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ధర్మవరంలో రూ.38 కోట్ల వ్యయంతో మెగా చేనేత క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీని ద్వారా సుమారు 10 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.అదే విధంగా మంగళగిరిలో రూ.22 కోట్లతో, పిఠాపురంలో రూ.15 కోట్లతో కొత్త చేనేత పార్కులను అభివృద్ధి చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 10 చిన్న చేనేత క్లస్టర్లను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
చేనేత కార్మికులకు ఆధునిక మగ్గాలను 90 శాతం సబ్సిడీతో అందించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. అలాగే చేనేత వస్త్రాలు, హస్తకళ ఉత్పత్తులను విక్రయించేందుకు ప్రత్యేక షోరూమ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ చర్యలతో చేనేత రంగానికి కొత్త ఊపు వస్తుందని, తమ జీవనోపాధి మరింత మెరుగుపడుతుందని నేతన్నలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.