Bengaluru Triple Murder Case : బెంగళూరులో అత్యంత ఘోరమైన దారుణం జరిగింది. రూ. 30 లక్షల అప్పుల గోల, ప్రేమ వ్యవహారానికి తల్లిదండ్రులు అడ్డుచెప్పారనే కోపంతో..
ఆ ఇంటి పెద్ద కుమార్తె తాను సహజీవనం చేస్తున్న వ్యక్తితో కలిసి కన్నవారిని కాటికి పంపింది. ముఖ్యంగా అమ్మా, నాన్నలతో పాటు తన చెల్లిని కూడా అత్యంత క్రూరంగా చంపేసింది. ఈ దారుణమైన ఊచకోత కేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సీగేహళ్లి, ధమానిక్ లేఅవుట్లో గల 'సాయి గ్రీన్ అపార్ట్మెంట్' లో సోమవారం చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో మూడు శవాలు పడి ఉండటాన్ని చూసి స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.హత్యల వెనుక అసలు కారణం ఇదే..!ఈ కిరాతక దాడిలో 55 ఏళ్ల సోమసుందర్, 48 ఏళ్ల వయసు కల్గిన ఆయన భార్య ముత్తులక్ష్మి, 20 ఏళ్ల వయసు కల్గిన వారి చిన్న కుమార్తె సుప్రియ దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ దంపతుల పెద్ద కుమార్తె శ్వేత, ఆమె ప్రియుడు కెన్నెత్ చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు. అయితే శ్వేతకు దాదాపు రూ. 30 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అప్పుల విషయమై, అలాగే కెన్నెత్తో నడుపుతున్న ప్రేమ వ్యవహారమై తల్లిదండ్రులు శ్వేతను తరచూ తిడుతూ ఉండేవారు. ఈ క్రమంలోనే తమ దారికి అడ్డొస్తున్న కుటుంబ సభ్యులను పూర్తిగా అంతమొందించాలని శ్వేత, కెన్నెత్ ముందే ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.పక్కా ప్లాన్.. ఒకరి తర్వాత ఒకరిని వేటాడి!పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. సోమవారం రోజు ఇంట్లో తండ్రి సోమసుందర్, చిన్న కుమార్తె సుప్రియ లేని సమయం చూసి శ్వేత, కెన్నెత్ అపార్ట్మెంట్కు వచ్చారు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న తల్లి ముత్తు లక్ష్మితో గొడవకు దిగారు. వివాదం ముదరడంతో ఇద్దరూ కలిసి ఆమెపై కొడవలి లాంటి పదునైన ఆయుధంతో దాడి చేసి అక్కడికక్కడే నరికి చంపారు. అనంతరం సాక్ష్యాలను రూపుమాపేందుకు బాత్రూమ్లో రక్తం మరకలను కడిగేసి, మిగిలిన ఇద్దరి కోసం ఇంట్లోనే మాటు వేశారు.కొద్దిసేపటి తర్వాత చిన్న చెల్లి సుప్రియ ఇంటికి రాగానే.. శ్వేత ఆమెను గట్టిగా పట్టుకోగా కెన్నెత్ ఆయుధంతో దాడి చేసి ప్రాణాలు తీశాడు. చివరగా తండ్రి సోమసుందర్ రాగా.. ఆయనపై కూడా కిరాతకంగా దాడి చేశారు. తీవ్ర గాయాలైనప్పటికీ సోమసుందర్ ప్రాణభయంతో అపార్ట్మెంట్ బయటకు పరుగులు తీసి సహాయం కోసం అరిచారు. కానీ తీవ్ర రక్తస్రావం కావడం వల్ల ఆయన కూడా అక్కడే కన్నుమూశారు.హత్యల అనంతరం పరారైన జంట..!ఈ ఘోరానికి ఒడిగట్టిన అనంతరం శ్వేత, కెన్నెత్ ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనా స్థలానికి చేరుకున్న కేఆర్ పురం పోలీసులు క్లూస్ టీమ్ సాయంతో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఈస్ట్ పాయింట్ ఆసుపత్రికి తరలించారు. ఈ కేసులో ఇప్పటికే ఒక అనుమానితుడిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నా.. పూర్తి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు శ్వేత, కెన్నెత్ ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఐటీ నగరంలో జరిగిన ఈ క్రూరమైన త్రిపుల్ మర్డర్ స్థానికులను వణికించింది.