అమెరికా - ఇరాన్ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఖతార్‌తో పాటు పాక్ ప్రధాని కూడా ఈ శాంతి చర్చల్లో పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ పాత్రపై అమెరికాకు చెంది
న రిపబ్లికన్ సెనేటర్లు సందేహాలు వ్యక్తం చేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పాకిస్థాన్‌ను ప్రశంసించిన కొద్ది రోజులకే ఈ వ్యాఖ్యలు రావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. స్విట్జర్లాండ్ వేదికగా శాంతి ఒప్పంద చర్చలు ముగిసిన తర్వాత పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇరు దేశాలకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా పాకిస్థాన్‌ను ప్రశంసించారు. అయితే తుది ఒప్పందానికి సంబంధించి చర్చలు కొనసాగుతున్న వేళ అమెరికా సెనేటర్లు రిక్ స్కాట్, టిమ్ షిహీ పాకిస్థాన్‌పై ప్రశ్నలు లేవనెత్తారు. "ఖతార్, పాకిస్థాన్‌లకు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన చరిత్ర ఉంది. ఇరాన్ దశాబ్దాలుగా కొనసాగిస్తున్న ఉగ్రవాద కార్యక్రమాలకు అవి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది" అంటూ సోషల్ మీడియా వేదిక ఎక్స్‌లో రిక్ స్కాట్ పోస్ట్ చేశారు. "పాకిస్థాన్ దాదాపు పదేళ్ల పాటు అల్ ఖైదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను దాచి పెట్టింది. పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ ద్వారా ఇరాన్‌కు కూడా మద్దతు అందింది. అమెరికాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాట్లకు కూడా ఐఎస్ఐ మద్దతు ఇచ్చింది. అలాంటి దేశం నిష్పాక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తుందని భావించడం కరెక్ట్ కాదు" అని ఓ ఇంటర్వ్యూలో మరో రిపబ్లికన్ సెనేటర్ టిమ్ షిహీ వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు నిజమైన మిత్రదేశాలైన ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియాకు కూడా శాంతి చర్చల్లో భాగస్వామ్యం కల్పించాలని వారు సూచించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ కూడా గతంలో పాకిస్థాన్‌పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌పై పాకిస్థాన్ చాలా కాలం వ్యతిరేకతతో ఉంది. గతంలో ఇరాన్ సైనిక విమానాలు పాకిస్థాన్ వైమానిక స్థావరాల్లో ఉంచారన్న వార్తలు కూడా వచ్చాయని ఆయన గుర్తు చేశారు. మొత్తానికి ఈ శాంతి చర్చల్లో పాక్ పాత్రపై అమెరికా వర్గాలే అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.