
పోస్టాఫీసుల్లో అనేక సేవింగ్స్, బీమా వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతోమంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు.
ఇతర స్కీమ్స్‌తో పోల్చుకుంటే పోస్టాఫీసు పథకాల్లో భద్రతతో పాటు అధిక వడ్డీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. దీంతో పోస్టాఫీసు పథకాలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పథకాల్లో గ్రామ సురక్షా యోజన పథకం ఒకటి. ఈ పథకంతో బీమాతో పాటు ఆదాయం కూడా పొందవచ్చు.
చిన్న పెట్టుబడులపై అధిక ఆదాయాన్ని అందిస్తుండటంతో ఈ పథకం ప్రజాదరణనను సొంతం చేసుకుంది. ఈ పథకంలో చేరాలంటే 19 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. కనీస హామీ మొత్తం రూ.10 వేల నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుంది. దీనివల్ల తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు కూడా ఇందులో చేరవచ్చు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ పొందవచ్చు.
క్రమం తప్పకుండా రోజుకు కేవలం రూ.50 లేదా నెలకు సుమారు రూ.1,500 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో భారీగా ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ.35 లక్షల వరకు పొందే అవకాశముంది. పోస్ట్ ఆఫీస్ ఈ పథకం కింద పలు ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందిస్తోంది. పాలసీదారులు తమకు అత్యంత అనుకూలమైన ఆప్షన్ ఎంచుకోవచ్చు. తమ ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం చందాదారులు తమ పెట్టుబడులను కొనసాగించడానికి మరియు వారి పొదుపును సౌకర్యవంతంగా నిర్వహించుకోవడానికి సులభతరం చేస్తుంది
ఈ పథకంలో పెట్టుబడి పెట్టినవారు నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఒకవేళ వారు పాలసీని కొనసాగించలేకపోతే, మూడు సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఐదు సంవత్సరాల తర్వాత మంచి బోనస్‌ను కూడా అందిస్తుంది. ఈ పాలసీ వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పూర్తవుతుంది. అప్పుడే మెచ్యూరిటీ మొత్తం తిరిగి చెల్లిస్తారు.
పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి, జీవిత బీమా కవరేజ్, దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాల కలయికను అందిస్తుస్తోంది ఈ పథకం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. బీమాతో పాటు మంచి ఆదాయం గ్రామ సురక్షా యోజన పథకం ద్వారా పొందవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయంతో పాటు బీమా కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక.