Karnataka HC Nandini Milk : సోషల్ మీడియా వేదికగా లైకులు, వ్యూస్ కోసం ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తూ..
భయాందోళనలు సృష్టించే క్రియేటర్లకు కర్ణాటక హైకోర్టు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎమ్ఎఫ్) కి చెందిన ప్రముఖ నందిని బ్రాండ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పాలపై వివాదాస్పద ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేసినందుకు ఓ బెంగళూరు వైద్యురాలిపై నమోదైన ఎఫ్ఐఆర్పై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు జస్టిస్ ఎం. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ బెంచ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ సదరు డాక్టర్ దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది.అసలేం జరిగిందంటే..?బెంగళూరుకు చెందిన డాక్టర్ శరణ్య పద్మ.. నందిని స్ట్రాబెర్రీ ఫ్లేవర్ పాలు నకిలీవని, అవి ఆరోగ్యానికి సురక్షితం కాదంటూ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని రీల్స్ పోస్ట్ చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (కేఎమ్ఎఫ్) డైరెక్టర్ ఆర్. పద్మావతి మల్లేశ్వరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు డాక్టర్ శరణ్యపై భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 353(1)బీ కింద కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను, తదుపరి క్రిమినల్ విచారణను కొట్టివేయాలంటూ సదరు వైద్యురాలు హైకోర్టును ఆశ్రయించారు.ల్యాబ్ టెస్ట్ చేయకుండా పోస్టులా?: హైకోర్టు సీరియస్కోర్టు విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ.. తన క్లయింట్ సాధారణంగా లభించే పాలను తప్పు పట్టలేదని, కేవలం స్ట్రాబెర్రీ ఫ్లేవర్ వేరియంట్‌పై మాత్రమే వ్యాఖ్యానించారని కోర్టుకు తెలిపారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ నాగప్రసన్న తీవ్రంగా స్పందించారు. "ఆ పాలు నకిలీవని చెప్పడానికి మీ వద్ద ఉన్న శాస్త్రీయ ఆధారాలు ఏంటి? ప్రభుత్వ గుర్తింపు పొందిన ల్యాబ్ నుంచి ఏదైనా సర్టిఫికేట్ తీసుకున్నారా? సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడానికి ముందు ఈ సమస్యను ప్రభుత్వం లేదా సంబంధిత అధికారుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు?" అని గట్టిగా ప్రశ్నించారు.అంతేకాకుండా.. "పాలు నకిలీవని, ఆ ఫ్లేవర్ మంచిది కాదని సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడి సమాజంలో భయాందోళనలు సృష్టించలేరు. మీకు ఆ ఉత్పత్తి నచ్చకపోతే తాగడం మానేయండి. అంతేగానీ ప్రతీ చిన్న విషయానికి సోషల్ మీడియాను వాడుతూ ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల సమాజంలో లేనిపోని సమస్యలు వస్తాయి. ఇన్స్టాగ్రామ్ అనేది ఇలాంటి పనుల కోసం కాదు" అని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.క్షమాపణలు చెప్పినా తగ్గని కోర్టు..!సదరు డాక్టర్ ఇప్పటికే తన తప్పును తెలుసుకుని, ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. అయినప్పటికీ.. ప్రస్తుత దశలో పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన హైకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ లోపు కేసు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ మల్లేశ్వరం పోలీసులకు, ఫిర్యాదుదారురాలైన కేఎంఎఫ్ డైరెక్టర్ ఆర్. పద్మావతికి నోటీసులు జారీ చేసింది. సోషల్ మీడియాలో బ్రాండ్ల పరువు తీసేలా వీడియోలు చేసే కంటెంట్ క్రియేటర్లకు ఈ కోర్టు వ్యాఖ్యలు ఒక గుణపాఠంగా మారాయి.