
ఇంటర్నెట్‌డెస్క్: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతోన్న తరుణంలోనూ.. హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)పై అమెరికా, ఇరాన్ తరచూ ఏదో ఒక ప్రకటన చేస్తూనే ఉన్నాయి.
హర్మూజ్ నిర్వహణను ఇరానే (Iran) చూస్తుందని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ ఘాలిబఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ జలసంధి.. యుద్ధానికి ముందున్న స్థితికి ఎప్పటికీ తిరిగిరాదన్నారు.
‘‘మేం అమెరికన్లను ఎన్నడూ నమ్మలేదు. ఇప్పుడూ నమ్మడం లేదు. భవిష్యత్తులోనూ వారిపట్ల ఆ ధోరణితో ఉండటం సమంజసమే’’ అని ఘాలిబఫ్ అమెరికా పట్ల ఇరాన్‌కున్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్విట్జర్లాండ్‌లో ఇప్పటికే రెండు దేశాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఫ్రీజ్ చేసిన 12 బిలియన్ డాలర్ల ఇరాన్ ఆస్తులను విడుదల చేయడానికి తుది ఒప్పందం కుదిరిందని ఆయన పేర్కొన్నారు. కాగా.. తమ నుంచి సోయా, మొక్కజొన్న, గోధుమలు కొనేందుకు ఇరాన్ అంగీకరిస్తే.. ఫ్రీజ్ చేసిన ఆ దేశ ఆస్తులను విడుదల చేసేందుకు అమెరికా సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) హర్మూజ్‌పై భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. హర్మూజ్ పూర్తిగా తెరిచే ఉందని ప్రకటించారు. ఈ జలసంధికి మరోవైపున ఉన్న ఒమన్ దేశం తాజా పరిణామాలపై స్పందించింది. అంతర్జాతీయ చట్టాలకు, టోల్ రహిత ప్రయాణానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించింది. ఇరాన్-అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంపై నిర్మాణాత్మక చర్చలు జరిగాయని పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.