
Nirjala Ekadashi pooja: ఈ రోజున చాలా మందిరోజంతా ఉపవాసాలు చేసి మరీ రాత్రి పూట జాగరణ కూడా చేస్తారు. విష్ణు భజనలు, కీర్తనలు పఠిస్తారు.
ఈ క్రమంలో నిర్జల ఏకాదశి ఒక్క రోజు ఉపవాసం ఉంటే 24 ఏకాదశులు ఉపవాసం ఉన్న ఫలితం దక్కుతుందని పండితులు చెబుతున్నారు.
జ్యోతిష్య పండితుల ప్రకారం జ్యేష్ట మాసంలో శుక్లపక్షం వచ్చే ఏకాదశిని నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. మనకు ప్రతినెలలో రెండు ఏకాదశులు వస్తాయి. కృష్ణ పక్షం ఒకటి, శుక్లపక్షం మరోకటి.ఈ విధంగా ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. ఏకాదశి అనేది శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన తిథి.
ఈ సారి మనం నిజ జ్యేష్ట మాసంలో నిర్జల ఏకదశిని జూన్ 25న జరుపుకుంటున్నాం. ఏకాదశి తిథి జూన్ 24, బుధవారం సాయంత్రం 5.13 గంటలకు ప్రారంభమై, జూన్ 25, గురువారం రాత్రి 9.10 గంటలకు ముగుస్తుంది. సూర్యోదంలో ఉన్న తిథిని ప్రామాణికంగా మనం తీసుకుంటాం. దీన్ని బట్టి జూన్ 25న గురువారం రోజు మనం నిర్జల ఏకాదశిని జరుపుకుంటాం.
నిర్జల అంటే.. కనీసం నీళ్ల కూడా తాగకుండా ఉపవాసం చేస్తే విశేషమైన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. చాలా మంది ఈ వ్రతంను ఎంతో భక్తి శ్రద్దలతో ఆచరిస్తారు. బ్రాహ్మీ మూహుర్తంలో నిద్రలేచి ఆ తర్వాత స్నానం చేసి శుభ్రంగా బట్టలు ధరించి విష్ణుమూర్తి ప్రతిమను ఏర్పాటు చేసుకుని పూజించుకుంటారు.
భక్తితో షోడషోపచారాలతో పూజలు చేస్తారు. కొంత మంది నదీస్నానాలు ఆచరిస్తారు. సత్యనారాయణ వ్రతాలు కూడా చేస్తారు. ఈ క్రమంలో నిర్జల ఏకాదశి రోజు చేసే పూజలు, వ్రతాలు వెయ్యిరెట్ల గొప్ప శుభఫలితాలు ఇస్తాయని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.
పురాణాల ప్రకారం, ఐదుగురు పాండవులలో భీముడు అత్యంత ఆకలితో ఉండేవాడు. అతనికి ఆకలితో ఉండటం అసాధ్యంగా ఉండేది. దీంతో తన బాధను వేదవ్యాసుడికి చెప్పాడు. అప్పుడు మహర్షి, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే నిర్జల ఏకాదశి నాడు ఉపవాసం ఉండమని భీముడికి సలహా ఇచ్చారు. ఎందుకంటే అలా చేయడం వల్ల 24 ఏకాదశుల ఉపవాస పుణ్యం లభిస్తుంది. అందువల్ల, ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా పిలుస్తారు.
ఏకాదశి రోజున ఆవులకు గ్రాసం తినిపించాలి. మన చెయ్యితో శక్తి కొలది ఏదైన పదార్థం చేసి ఆవుకు పెట్టాలి. ముఖ్యంగా గురుబలం లేని వారు ఎర్రటి శనగల్ని నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు మొలకలు వచ్చాక దాన్ని బెల్లంతో కలిపి ఆవులకు పెట్టాలి. పేదవారికి అన్న, వస్త్రదానాలు చేయాలి. ఈ విధంగా చేస్తే అన్నిరకాల దోషాలు పోతాయి.
నిర్జల ఏకాదశి రోజున కొన్ని పనులు చేయకూడదు.. ఆహారం లేదా నీరు తీసుకోవద్దు. కోపాన్ని, ప్రతికూల ఆలోచనలను, వాగ్వాదాలు వంటివి మానుకోవాలి. అబద్ధాలు, దూషణ భాషను చేయకూడదు. పగటిపూట నిద్రపోవడం చేయకూడదు. తామసిక ఆహారాన్ని (ఉల్లిపాయ, వెల్లుల్లి, మాంసాహారం) తినవద్దు. సంభోగంకు దూరంగా ఉండాలి.