
ఆంధ్రాలో రొయ్యల వంటకాలు వెరీ స్పెషల్. వీటిని గోంగూరతో కలిపి వండితే చాలా రుచిగా ఉంటాయి. గోంగూరలోని పుల్లటి రుచితో ఏ వంటకానికైనా మంచి టేస్ట్ వస్తుంది.
ముఖ్యంగా రొయ్యలతో గోంగూర కలయిక అద్భుతమైన రుచిని అందిస్తుంది. పుల్లటి గోంగూర, మసాలాల ఘాటు, రొయ్యల రుచి కలిసి చేసే ఈ ఇగురు అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో సులభంగా గోంగూర రొయ్యల ఇగురు రెసిపీ ఎలా చేయాలో తెలుసుకోండి.
1. ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి, కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత గోంగూర ఆకులను శుభ్రంగా కడిగి ఆకులను ఆరబెట్టాలి.
2. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి గోంగూర ఆకులను వేయించి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. దీన్ని చల్లారిన తర్వాత ముద్దలా చేసుకోవాలి.
3. ఇప్పుడు మరో పాత్రలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేయాలి. అవి చిటపటలాడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
4. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులో వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. తర్వాత ఇందులో శుభ్రం చేసిన రొయ్యలను వేసి కొద్దిసేపు వేయించాలి.
5. రొయ్యలు రంగు మారిన తర్వాత పసుపు, కారం పొడి, ధనియాల పొడి, ఉప్పు వేసి బాగా కలపాలి.
6. మసాలాలు రొయ్యలకు పట్టిన తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర ముద్దను వేసి కలపాలి.
7. ఇప్పుడు కూరలో కొద్దిగా నీరు పోసి మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. చివర్లో కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి.
8. దీంతో గోంగూర రొయ్యల కూర మంచి వాసనతో సిద్ధమవుతుంది. ఈ కూరను వేడి వేడి అన్నం తింటే అద్భుతంగా ఉంటుంది