.webp&w=3840&q=75)
కూతురి ప్రాణాల కోసం తండ్రి మృత్యువుతో పోరాటం.. తమ పిల్లల ప్రాణాల కోసం తల్లిదండ్రులు ఎంతటి సాహసానికైనా సిద్ధపడతారని నిరూపించే ఒక హృదయవిదారక, ఒళ్లు గగుర్పొడిచే ఘటన మహారాష్ట్రలో వెలుగుచూసింది.
అంతర్జాతీయ ఫాదర్స్ డే వేళ ఓ తండ్రి తన కన్నకూతురిని కాపాడుకునేందుకు ఏకంగా క్రూర మృగమైన చిరుతపులితోనే పోరాడాడు. మృత్యువు నోట్లో చిక్కుకున్న కన్నబిడ్డను ప్రాణాలకు తెగించి కాపాడుకుని, నిజమైన హీరో అనిపించుకున్నాడు.
మహారాష్ట్రలోని అహిల్యానగర్ జిల్లా అకోలే తాలూకా పరిధిలోని డోంగర్గావ్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. స్థానిక రైతు మనోజ్ గుంజాల్ తన కుటుంబంతో కలిసి పొలం సమీపంలోని నివాసంలో ఉంటున్నాడు. రాత్రి సమయంలో మనోజ్ భార్య దీపాలి తన నాలుగేళ్ల కుమార్తె అవనిని వెనుక వీపుపై ఎక్కించుకుని నడుచుకుంటూ వస్తోంది. ఆ సమయంలో జొన్న చేలో మాటువేసిన ఒక చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసి, దీపాలి వీపుపై ఉన్న చిన్నారిని నోట కరుచుకుని చీకట్లోకి లాక్కెళ్లిపోయింది.
దీంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన దీపాలి భయాందోళనలతో గట్టిగా కేకలు వేసింది. భార్య ఆర్తనాదాలు విన్న మనోజ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా చిరుతపులి వెళ్లిన దిశగా పరుగెత్తాడు. దట్టమైన చీకట్లో క్రూర మృగం అని కూడా చూడకుండా తన ప్రాణాలను పణంగా పెట్టి చిరుతతో వీరోచితంగా పోరాడాడు. చివరకు ఆ వన్యమృగం నోటి నుంచి తన ముద్దుల కూతురిని సురక్షితంగా విడిపించుకున్నాడు.
అయితే, ఆ తర్వాత ఊహించని మరో ప్రమాదం జరిగింది. చిరుత నుండి కూతురిని రక్షించిన ఆనందంలో మనోజ్ చిన్నారిని ఎత్తుకుని ఇంటి వైపు పరుగెడుతుండగా, చీకటి కారణంగా పొలంలో ఉన్న ఒక పాడుబడ్డ లోతైన బావి అతడికి కనిపించలేదు. దీంతో తండ్రీకూతుళ్లిద్దరూ ఆ బావిలో పడిపోయారు. అంతటి ప్రమాదకర స్థితిలోనూ ఆ తండ్రి ధైర్యం కోల్పోకుండా, నీటిలో బిడ్డ మునిగిపోకుండా ఉండేందుకు చిన్నారిని తన చేతులతో తలపైనే పట్టి ఉంచడం విశేషం.
దీపాలి కేకలు విన్న గ్రామస్థులు వెంటనే టార్చ్ లైట్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. పొలంలో వెతకగా బావిలో నుంచి మనోజ్ సహాయం కోసం అరుస్తున్న శబ్దాలు వినిపించాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు తాడు సహాయంతో తండ్రీకూతుళ్లను సురక్షితంగా బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరినీ చికిత్స నిమిత్తం సంగమ్నేర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిద్దరూ అక్కడ చికిత్స పొందుతున్నారు.
ఈ సంఘటనపై చిన్నారి తల్లి దీపాలి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చీకటి పడితే పొలాల్లో పనిచేసే రైతులకు మరియు వారి కుటుంబాలకు రక్షణ కరువైందని వాపోయారు. ఇవాళ తన బిడ్డకు ఎదురైన పరిస్థితి రేపు మరో బిడ్డకు రాకూడదని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. అటవీ శాఖ అధికారులు ఇప్పటికైనా స్పందించి గ్రామాల్లో సంచరిస్తున్న క్రూర మృగాల బారి నుండి తమను కాపాడాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా చిరుతల సంచారం ఎక్కువైందని, మానవ-మృగ సంఘర్షణ పెరిగిపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అటవీ అధికారులు తಕ್ಷಣమే స్పందించి జనావాసాల్లోకి వస్తున్న వన్యప్రాణులను పట్టుకోవడానికి బోన్లు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. కన్నబిడ్డ కోసం సింహస్వప్నమైన చిరుతతోనే తలపడిన ఈ తండ్రి సాహసంపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది.
డబ్బు లేక ఏ ఒక్కరూ వైద్యానికి దూరం కాకూడదు : బాలకృష్ణ
వైభవంగా బసవతారకం హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ వేడుక
.