
ఏదైనా వెకేషన్‌కి వెళ్తే.. బోలెడన్ని మధురానుభూతుల్ని వెంట తెచ్చుకోవడమే కాదు.. తిరిగొచ్చే సరికి కాస్త బరువూ పెరుగుతారు కొందరు. వెళ్లిన చోట నచ్చిన ఆహారం తినడం, వ్యాయామం చేయకపోవడం..
వంటివి ఇందుకు కారణమవుతుంటాయి.
ఏదైనా వెకేషన్‌కి వెళ్తే.. బోలెడన్ని మధురానుభూతుల్ని వెంట తెచ్చుకోవడమే కాదు.. తిరిగొచ్చే సరికి కాస్త బరువూ పెరుగుతారు కొందరు. వెళ్లిన చోట నచ్చిన ఆహారం తినడం, వ్యాయామం చేయకపోవడం.. వంటివి ఇందుకు కారణమవుతుంటాయి. కానీ తాను మాత్రం ఒక్క గ్రాము కూడా పెరగలేదంటోంది బాలీవుడ్ నటి, రచయిత్రి సోహా అలీ ఖాన్. ఇటీవలే లండన్ వెళ్లొచ్చిన ఈ ముద్దుగుమ్మ.. రెండు వారాల పాటు అక్కడే గడిపింది. అయినా బరువును అదుపులో ఉంచుకున్నానంటోంది. ఇందుకు తానేం చేసిందో చెబుతూ తాజాగా ఇన్‌స్టాలో ఓ పోస్ట్ పెట్టింది సోహా.
ప్రస్తుతం అమ్మగా, నటిగా, పాడ్‌కాస్టర్‌గా బిజీగా ఉంది సోహా. ఇన్‌స్టాలో చురుగ్గా ఉండే ఆమె.. తన వ్యక్తిగత, కెరీర్ విశేషాల్ని తరచూ అందులో పంచుకుంటుంటుంది. మరోవైపు ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యమిచ్చే ఈ చక్కనమ్మ.. తన ఫిట్నెస్ సీక్రెట్స్నీ ఈ వేదికగా బయటపెడుతుంటుంది. అయితే ఇటీవలే రెండు వారాల టూర్లో భాగంగా లండన్‌ని చుట్టొచ్చిందామె. తన భర్త కునాల్, కూతురు ఇనాయాలతో కలిసి అక్కడి పలు ప్రదేశాల్ని సందర్శించింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది సోహా.
‘పర్యటనలకు వెళ్లినప్పుడు కొంతమంది బరువు పెరగడం సహజం. నేను కూడా ఇటీవలే లండన్‌లో రెండు వారాల పాటు గడిపా. అయినా తిరిగొచ్చేసరికి బరువు పెరగలేదు. ఎందుకంటే ఆయా ప్రదేశాల్ని సందర్శించడంలో భాగంగా రోజూ 15 వేల అడుగులు వేశా. అక్కడి పార్కులు, మ్యూజియంలు, మార్కెట్లు, వీధులు, మాల్స్.. ఇలా ఎక్కడికెళ్లినా నడిచే వెళ్లేదాన్ని. ఇనాయా కూడా మాకు పూర్తిగా సహకరించింది. ఇలా ఈ హాలిడేతో ఎన్నో మధురానుభూతుల్ని సొంతం చేసుకోవడంతో పాటు ఫిట్‌నెస్‌నీ కాపాడుకున్నా..’ అంటూ తాను వెకేషన్లో పాటించిన ఫిట్నెస్ సీక్రెట్ గురించి పంచుకుంది.
ఈ క్రమంలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఫిట్‌నెస్‌ని కోల్పోకూడదన్నా, బరువును అదుపులో ఉంచుకోవాలన్నా కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ముఖ్యమంటున్నారు నిపుణులు.
⚛ మీరు వెళ్లిన ట్రిప్‌లో భాగంగా ప్రతి ప్రదేశానికీ కార్లో వెళ్లడమో లేదంటే అక్కడి ప్రజా రవాణాను వినియోగించుకోవడమో కాకుండా.. దగ్గరి ప్రదేశాల్ని కాలి నడకన సందర్శించడం మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా శరీరానికి వ్యాయామం అందడంతో పాటు ఆ ప్రదేశపు అందాల్ని తనివితీరా ఆస్వాదించచ్చని చెబుతున్నారు.
⚛ ఎలాగూ టూర్‌కి వెళ్తున్నాం.. రిలాక్సవుదాం.. అన్న ఉద్దేశంతో వ్యాయామాల్ని పక్కన పెడుతుంటారు కొందరు. కానీ వెకేషన్‌లోనూ ఫిట్నెస్ రొటీన్‌ని యథావిధిగా కొనసాగించడమే మంచిదంటున్నారు నిపుణులు. తద్వారా ఫిట్నెస్ను కోల్పోకుండా జాగ్రత్తపడచ్చంటున్నారు.
⚛ వెకేషన్‌లోనూ ఫిట్నెస్ రొటీన్‌ని కొనసాగించేందుకు.. రెసిస్టెన్స్ బ్యాండ్స్, స్కిప్పింగ్ రోప్, యోగా మ్యాట్, డంబెల్స్.. వంటి చిన్నపాటి, తక్కువ బరువున్న ఫిట్నెస్ పరికరాల్ని వెంట తీసుకెళ్తే.. వెళ్లిన చోట వీటితో వ్యాయామం చేయచ్చు.
⚛ ఒకవేళ తీసుకెళ్లకపోయినా.. మీరు బస చేసే హోటల్లో జిమ్ సౌకర్యం ఉందో లేదో ముందే తెలుసుకోవాలి.. ఫలితంగా అక్కడ మీ జిమ్ రొటీన్‌ని కొనసాగించచ్చు.
⚛ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి ప్రత్యేక వంటకాల్ని రుచి చూడాలని ఎవరికైనా అనిపిస్తుంది. అలాగని వాటిని ఎక్కువగా తినేయడం కాకుండా.. మితంగా తినడం మంచిదంటున్నారు నిపుణులు. అలాగే మీరు ఎంచుకునే మెనూలో ప్రొటీన్లు ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, పెరుగు, మాంసాహారం, శాకాహారులు-వీగన్లైతే.. పప్పులు, సోయా ఉత్పత్తులు, బీన్స్.. వంటి పదార్థాలు ఉండేలా జాగ్రత్తపడడం ముఖ్యమంటున్నారు. అప్పుడే ఫిట్నెస్ను కోల్పోకుండా చూసుకోవచ్చని చెబుతున్నారు.
⚛ బరువు అదుపులో ఉంచుకోవడానికి నీళ్లు ఎక్కువగా తాగడం కూడా ముఖ్యమే. కాబట్టి ఎప్పుడూ వెంట ఓ నీళ్ల బాటిల్ ఉంచుకోవడంతో పాటు నీటి శాతం అధికంగా ఉండే తాజా పండ్లు తీసుకోవడం మర్చిపోకూడదు.
⚛ టూర్లో భాగంగా ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వస్తే.. రైలు/విమానం సీట్లో గంటల తరబడి అలాగే కూర్చోకూడదు. లేచి కాసేపు అటూ ఇటూ తిరగడం, చేతులు-కాళ్లు ఆడిస్తూ వ్యాయామం చేయడం, నెమ్మదిగా గుంజీలు తీయడం.. వంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్లు శరీరానికి చక్కటి వ్యాయామం అందిస్తాయి. అలాగే ప్రయాణ అలసటనూ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
For digital advertisements Contact : 040 - 23318181 eMail: marketing@eenadu.in
This website follows the DNPA Code of Ethics.