
ఇంటర్నెట్డెస్క్: దేశవ్యాప్తంగా నీట్ రీటెస్ట్ (NEET) ఆదివారం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం లీక్ అయిందంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న ఓ వీడియోపై ఎన్టీఏ మరోసారి స్పందించింది.
అది నకిలీదని ఎక్స్ వేదికగా వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది.
దేశవ్యాప్తంగా అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రీటెస్ట్ విజయవంతంగా ముగిసిందని ఎన్టీఏ (NTA) వెల్లడించింది. అవాస్తవాలతో కూడిన వీడియోను కొందరు కావాలనే సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. తప్పుడు సమాచారాన్ని సృష్టించి, విద్యార్థులను ఆందోళనకు గురిచేయడం తీవ్రమైన నేరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కేవలం అధికారిక వెబ్సైట్లో వచ్చే సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని, తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్, ఫార్వార్డ్ చేయొద్దని కోరింది.
కాగా.. దేశవ్యాప్తంగా నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు 20 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు. దిల్లీలోని ఎన్టీఏ ప్రధాన కార్యాలయం నుంచి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమీక్షించారు. అన్ని ప్రభుత్వ విభాగాల సహకారంతో పునః పరీక్షను రికార్డు సమయం (37 రోజుల్లో)లో దిగ్విజయంగా నిర్వహించగలిగామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ పేర్కొన్నారు. తొలుత మే 3న ఈ ప్రవేశ పరీక్ష జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ లీక్ ఆరోపణలతో దాన్ని రద్దు చేయాల్సి వచ్చింది.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ఆదివారం బెంగళూరులో హస్తం పార్టీ నిర్వహించిన ర్యాలీ కారణంగా ముగ్గురు విద్యార్థులు నీట్ పరీక్ష రాయలేకపోయారని ఆరోపణలు వస్తున్నాయి. ర్యాలీ కారణంగా ట్రాఫిక్ జామ్ అవడంతో పరీక్షాకేంద్రాలకు చేరుకోవడంలో ఇబ్బందిపడ్డామని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇప్పుడీ వ్యవహారం భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.