
AI సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్' ప్రశ్నపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందోర్ (మధ్యప్రదేశ్), జూన్ 22: దేశవ్యాప్తంగా నిన్న(ఆదివారం) జరిగిన నీట్-యూజీ (NEET) పరీక్షలకు సంబంధించి ఒక ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి నకిలీ 'నీట్-యూజీ' ప్రశ్నాపత్రాన్ని సృష్టించి, దాన్ని సోషల్ మీడియాలో విక్రయించిన ఒక లా (Law) విద్యార్థిని మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ మోసానికి సంబంధించిన వివరాలను డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP, క్రైమ్ బ్రాంచ్) రాజేష్ కుమార్ త్రిపాఠి మీడియాకు వెల్లడించారు. నిందితుడు ఒక్కో ప్రశ్నాపత్రానికి రూ.50 నుంచి రూ.100 వరకు వసూలు చేశాడు. ధర తక్కువగా ఉండటంతో చాలామంది విద్యార్థులు దీన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. ఇలా దాదాపు 22 నుంచి 25 మందికి ఈ నకిలీ పేపర్లను విక్రయించి, సుమారు రూ.25,000 నుంచి రూ.30,000 వరకు అక్రమంగా సంపాదించాడు.
'నిందితుడు అక్షయ్ మాల్వియా కేవలం డబ్బు సంపాదన కోసమే కాకుండా, విద్యార్థుల్లో తీవ్ర గందరగోళం సృష్టించేలా ఈ నకిలీ పేపర్లను తయారు చేశాడు. సోషల్ మీడియాపై నిరంతరం నిఘా ఉంచిన క్రైమ్ బ్రాంచ్ బృందానికి అందిన సమాచారం ఆధారంగా అతడిని అదుపులోకి తీసుకున్నాం. నిన్న (ఆదివారం) దేశవ్యాప్తంగా జరిగిన ఒరిజినల్ నీట్ పరీక్షా పత్రానికి, ఈ నిందితుడు సృష్టించిన నకిలీ పేపర్‌కు ఎలాంటి సంబంధం లేదు' అని డీసీపీ త్రిపాఠి స్పష్టం చేశారు.
నిందితుడిపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అతడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 318(4)(చీటింగ్, మోసపూరితంగా ఆస్తిని లాక్కోవడం)తో పాటు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) యాక్ట్ సెక్షన్ 66(కంప్యూటర్ ఆధారిత నేరాలు) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
‘నా భర్త అన్ని లిమిట్స్ క్రాస్ చేశాడు’.. టెకీ రాధాగాయత్రి చివరి ఆడియో
ఆధ్యాత్మిక, సనాతన పరిరక్షణ కేంద్రాలుగా ఆలయాలు: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి