
Vaibhav Sooryavanshi : భారత్, ఐర్లాండ్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జూన్ 26, జూన్ 28 తేదీలలో జరగనుంది. ఈ సిరీస్ కోసం భారత క్రికెట్ అభిమానులంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దీనికి ప్రధాన కారణం దేశవాళీ క్రికెట్లో రికార్డుల సునామీ సృష్టించిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండటమే. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని జట్టులోకి ఎలా తీసుకోవాలనే దానిపై మాజీ క్రికెట్ పండితులు, మాజీ సెలెక్టర్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు.
బీసీసీఐ మాజీ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కిరణ్ మోరే ఒక ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ టాక్ షోలో మాట్లాడుతూ వైభవ్‌కు మద్దతుగా నిలిచారు. “నేనే గనుక టీమిండియా కెప్టెన్‌గానీ లేదా సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గానీ అయి ఉంటే.. ఐర్లాండ్ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీకి 100 శాతం తుది జట్టులో అవకాశం ఇచ్చేవాడిని. అతనేమీ సాధారణ ఆటగాడు కాదు, ఒక అద్భుతమైన టాలెంట్ కలిగిన ప్లేయర్. మన దేశంలో మొదట కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్ వచ్చారు.. ఆ తర్వాత సచిన్ టెండూల్కర్, ఆ పైన విరాట్ కోహ్లీ వచ్చారు.. ఇప్పుడు మళ్లీ అలాంటి క్యాలిబర్ ఉన్న ఆటగాడు మనకు వైభవ్ రూపంలో దొరికాడు” అని మోరే ప్రశంసించారు.
వైభవ్‌కు ఓపెనర్‌గా అవకాశం ఇవ్వడం కోసం జట్టులోని సీనియర్ ఆటగాళ్లతో మాట్లాడాలని కిరణ్ మోరే సూచించారు. “కెప్టెన్, కోచ్ కలిసి అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లేదా ఇషాన్ కిషన్లతో మాట్లాడాలి. వారిని బెంచ్‌పై కూర్చోబెట్టినంత మాత్రాన వారి స్థానానికి ఎలాంటి ముప్పు లేదని, కేవలం వైభవ్ లాంటి అరుదైన టాలెంటును పరీక్షించడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని వారికి నచ్చజెప్పాలి. ఈ విధమైన కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తూ వైభవ్‌ను కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి తీసుకురావాలి. అతను రాత్రికి రాత్రే అద్భుతాలు చేయకపోవచ్చు, కానీ భవిష్యత్తులో ఒక గొప్ప లెజెండ్‌గా మారే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయి” అని మోరే స్పష్టం చేశారు.
కిరణ్ మోరే వ్యాఖ్యలతో మరో మాజీ క్రికెటర్ సబా కరీమ్ కూడా పూర్తిగా ఏకీభవించారు. గతంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ జట్టులోకి వచ్చిన విధానాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. “సచిన్ టెండూల్కర్ మొదటిసారి భారత జట్టులోకి వచ్చినప్పుడు అతని కోసం ప్రత్యేకంగా స్థానం లేదు. కానీ అతనిలోని టాలెంట్‌ను గుర్తించి అప్పటి పెద్ద ప్లేయర్లను పక్కనబెట్టి మరీ సచిన్‌ను జట్టులోకి తీసుకొచ్చారు. నేరుగా ప్లేయింగ్ ఎలెవెన్‌లోకి పంపి ఆడించారు. వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా టీమిండియా మేనేజ్మెంట్ సరిగ్గా ఇదే ఫార్ములాను వాడాలి” అని సబా కరీమ్ అన్నారు.
ఇదిలావుండగా, లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ టూర్లో బరిలోకి దిగడం ఖాయమని లైవ్ కామెంటరీలో ముందే జోస్యం చెప్పారు. వైభవ్‌ను ఓపెనర్‌గా పంపించి, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్‌లకు లీగ్ మ్యాచ్‌లలో మార్చి మార్చి ఒకే ఒక్క మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చేలా టీమ్ ప్లాన్ చేస్తోందని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. సీనియర్ల అండతో ఈ యువ రికార్డ్ బ్రేకర్ అంతర్జాతీయ వేదికపై ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలని ఫ్యాన్స్ ఆత్రుతగా ఉన్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి