ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను డైరెక్టర్ మెహర్ రమేష్ కలిశారు. మరికొన్ని రోజుల్లో జరగనున్న తన కుమార్తె వివాహానికి ఆహ్వానించారు. పెళ్లి పత్రికను అందజేశారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను మెహర్ రమేష్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. అప్పట్లో పవన్ తన వివాహానికి వచ్చి ఆశీర్వదించారని, ఇప్పుడు తన కుమార్తె పెళ్లికి రమ్మని ఆహ్వానించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఏళ్లు గడిచినా పవన్‌తో తన అనుబంధం శాశ్వతమని దర్శకుడు పేర్కొన్నారు. ‘‘కొన్నేళ్ల క్రితం విజయవాడలో జరిగిన నా పెళ్లికి పవన్ కళ్యాణ్ అన్న స్వయంగా నన్ను ఆశీర్వదించడానికి వచ్చారు. ఈరోజు నేను విజయవాడ వచ్చి నా కుమార్తె పెళ్లికి ఏపీ ఉప ముఖ్యమంత్రి ని ఆహ్వానించాను. ఇది నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. కాలం మారుతుంది.. తరాలు మారతాయి.. కానీ మా సోదరభావం మాత్రం ఎప్పటికీ అలాగే నిలిచి ఉంటుంది’’ అని మెహర్ రమేష్ పోస్ట్ చేశారు. పవన్ - మెహర్ కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్, మెహర్ రమేష్ కుటుంబాల మధ్య బంధుత్వం ఉందనే సంగతి చాలా తక్కువ మందికే తెలుసు. వీరిద్దరూ వరసకు అన్నదమ్ములు అవుతారు. పవన్ పిన్ని కొడుకే మెహర్. అంజనా దేవి, మెహర్ తల్లి సొంత అక్కాచెల్లెళ్లు. చిన్నప్పటి నుంచే చిరంజీవి, పవన్ కళ్యాణ్ లతో మెహర్ రమేష్ కి మంచి బాండింగ్ ఉంది. మెగా ఫ్యామిలీకి అన్ని విషయాల్లోనూ మెహర్ చేదోడు వాదోడుగా ఉంటారు. పవన్ తో సినిమా చేయలేదు కానీ.. చిరుతో ఆయన 'భోళా శంకర్' అనే రీమేక్ చిత్రాన్ని తెరకెక్కించారు.ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవలే మెహర్ రమేశ్‌ను ఏపీ రాష్ట్ర ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తన కుమార్తె పెళ్లికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఆహ్వానించిన మెహర్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ''ఈ ఫాదర్స్ డే నాడు మా ఆంధ్రప్రదేశ్ స్టేట్ గాడ్ ఫాదర్ గారైన సీఎం చంద్రబాబుని కలిశాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రతిపాదన, మద్దతుతో APSFTVTDC (ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్)కి వైస్ చైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు సార్‌కు ధన్యవాదాలు తెలిపాను. నా కుమార్తె వివాహానికి ఆహ్వానించాను'' అని మెహర్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. కొన్ని ఫోటోలను పంచుకున్నారు.ఇకపోతే ఆంధ్రప్రదేశ్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తోనే మెహర్ రమేష్ వియ్యమందుకుంటున్నారు. తోట చంద్రశేఖర్ కుమారుడుకి మెహర్ రమేష్ కుమార్తెని ఇచ్చి వివాహం జరిపిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ కన్వెన్షన్‌లో వీరి ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి సహా పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అప్పుడు పవన్ కళ్యాణ్ కు సర్జరీ జరగడంతో, నిశ్చితార్థానికి వెళ్లలేపోయారు. పెళ్లికి మాత్రం తప్పకుండా రావాలని పవన్ ను మెహర్ ఆహ్వానించారు. తోట చంద్రశేఖర్‌కు మెగా ఫ్యామిలీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే సంగతి తెలిసిందే. ఆయన గతంలో జనసేన పార్టీలోనూ పనిచేశారు.