
ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచ కప్‌లో భారత్ వరుస విజయాలకు బ్రేక్ పడింది. దక్షిణాఫ్రికా చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. సఫారీ బ్యాటర్ మరిజేన్ కాప్ (81*) చివరి వరకూ క్రీజ్‌లో నిలబడి తన జట్టును గెలిపించింది. తెలుగు అమ్మాయి శ్రీ చరణి (3/24), షఫాలీ వర్మ (1/22) నాణ్యమైన బౌలింగ్ వేసినా మిగతా బౌలర్లు పెద్దగా రాణించలేదు. ఫీల్డింగ్‌లోనూ పలు క్యాచ్‌లను వదిలేయడం టీమ్ఇండియా ఓటమికి ప్రధాన కారణం. ఇదే మాటను కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా అంగీకరించింది. బౌలర్లకు ఫీల్డర్ల మద్దతు అవసరమని వ్యాఖ్యానించింది.
‘‘మేం మ్యాచులో గెలిచే అవకాశాలు వచ్చాయి. కానీ, చేజేతులా అవకాశాలను వదులుకున్నాం. ఇంకా రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. పాజిటివ్‌గానే ముందుకు సాగుతాం. మేం నిర్దేశించిన టార్గెట్‌ను కాపాడుకోవచ్చని భావించాం. శ్రీ చరణి, షఫాలీ అద్భుతంగా బౌలింగ్ వేశారు. సఫారీ బ్యాటర్లకు సవాల్ విసిరారు. ఇతర బౌలర్ల నుంచి, ఫీల్డర్ల నుంచి వారికి సరైన మద్దతు దొరకలేదు. కాప్ చాలా అద్భుతంగా ఆడింది. మా నుంచి మ్యాచ్‌ను దూరం చేసింది. క్యాచ్‌లను వదిలేయడం వల్ల మ్యాచ్ చేజారింది’’ అని హర్మన్ తెలిపింది.
‘‘అంతర్జాతీయంగా 200 టీ20లను ఆడటం గొప్పగా ఉంది. ఎన్నో విషయాలను నేర్చుకున్నా. ఆట గురించి భిన్నంగా ఆలోచించగలిగా. ఓడిన ఈ మ్యాచ్ నుంచీ చాలా పాజిటివ్ అంశాలను తీసుకున్నా. సహచరులతో మాట్లాడాల్సిన సమయం ఇది. వారికి మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత నాపై ఉంది. రాబోయే రెండు మ్యాచుల్లో జట్టుగా విజయాలు సాధిస్తామని ఆశిస్తున్నా’’ అని హర్మన్ వెల్లడించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.