
మూడు ముళ్లు బంధంతో ఇద్దరు వ్యక్తులు ఒక్కటయ్యే వేడుకే వివాహం. కేవలం ఇద్దరు వ్యక్తులే కాకుండా వారి కుటుంబాలు సైతం ఒక్కటవుతాయి. అందుకే పెళ్లి విషయంలో అటు ఏడు తరాలు..
ఇటు ఏడు తరాలు చూసి అయినా కానీ మంచి సంబంధం ఫిక్స్ చేసుకోవాలని అంటారు. అయితే మారుతున్న కాలనుగుణంగా ఇప్పుడు పెళ్లికి ముందు కాబోయే వధూవరులు ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్‌లు, రీల్స్, వీడియోలు చేసి వాటిని సోషల్ మీడియాలో పంచుకోవడం ట్రెండ్‌గా మారింది. కానీ మహారాష్ట్రలో ఇదే ట్రెండ్ ఓ బాల్యవివాహాన్ని బయటపెట్టింది. 15 ఏళ్ల బాలికకు 23 ఏళ్ల యువకుడితో పెళ్లి ఏర్పాట్లు..Maharashtraలోని Beed districtలో ఈ ఘటన చోటుచేసుకుంది. గెవరాయీ మండలానికి చెందిన 23 ఏళ్ల యువకుడికి 15 ఏళ్ల బాలికతో కుటుంబ సభ్యులు వివాహం నిశ్చయించారు. పెళ్లి తేదీ ఖరారు చేయడంతో పాటు ఇరువురు కలిసి ప్రీ-వెడ్డింగ్ ఫొటో షూట్ కూడా నిర్వహించారు. ఆ ఫొటోలు, వీడియోలను కుటుంబ సభ్యులు, స్నేహితులు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో విషయం అధికారుల దృష్టికి వెళ్లింది. ప్రీ-వెడ్డింగ్ షూట్ చిత్రాలు జిల్లా కలెక్టర్ Vivek Johnson దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను అప్రమత్తం చేసి, వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించారు. అధికారులు బాలిక గ్రామానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.గోరింటాకులో వరుడి పేరు..గ్రామానికి వెళ్లిన అధికారులకు బాలిక చేతిపై వరుడి పేరుతో గోరింటాకు కనిపించింది. అయితే వివాహం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పెళ్లి ఇంకా జరగలేదని అధికారులు నిర్ధారించారు. దీంతో వెంటనే వివాహ ఏర్పాట్లను నిలిపివేసి, బాల్యవివాహం జరగకుండా అడ్డుకున్నారు. మైనర్ బాలికను అధికారులు సంరక్షణలోకి తీసుకుని కౌన్సెలింగ్ నిర్వహించారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు, వివాహ ఏర్పాట్లలో పాల్గొన్న వారిని విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో బాల్యవివాహానికి సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.బాల్యవివాహం చట్టరీత్యా నేరమే..భారతదేశంలో 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు యువకులకు వివాహం చేయడం చట్టవిరుద్ధం. బాల్యవివాహం నిరోధక చట్టం ప్రకారం ఇలాంటి వివాహాలను నిర్వహించిన తల్లిదండ్రులు, బంధువులు, మధ్యవర్తులు, పురోహితులు సహా బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయవచ్చు. మరోవైపు నేటి కాలంలో సోషల్ మీడియా అంటే వినోదం, సమాచారం కోసం ఉపయోగపడుతున్నప్పటికీ, ఈ ఘటనలో మాత్రం అది ఓ మైనర్ బాలిక భవిష్యత్తును కాపాడిన సాధనంగా మారింది. ప్రీ-వెడ్డింగ్ షూట్ కోసం తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కాకపోయి ఉంటే ఈ బాల్యవివాహం నిశ్శబ్దంగా జరిగిపోయేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు.