
యోగా అంటే ఆసనాలు వేయడమో... ఊపిరి బిగపట్టడమో కాదు. జీవితాన్ని అధీనంలోకి తెచ్చుకోవడం. మనదైన ఈ ప్రక్రియ అవసరం ఇప్పుడు చాలా ఎక్కువ!
ఆధునిక జీవనశైలితో కొనితెచ్చుకుంటున్న వ్యాధుల్ని ఎదుర్కొనడానికి యోగా ఓ పరమౌషధం. ఉరుకులు, పరుగుల జీవితంలో ఆత్మకు స్వచ్ఛత, మనసుకు ప్రశాంతత, ఒంటికి వ్యాయామం... ఏదీ ఉండట్లేదు. ఈ పరిస్థితుల్లో మానవాళికి అందుబాటులో ఉన్న అతి పెద్ద భాగ్యం యోగా. గాడితప్పిన శరీరాన్ని సరైన దారిలో పెట్టడానికి ఆసనాలు ఉపయోగపడితే.. అంతర్గత ఉన్నతికి ప్రాణాయామ, ధ్యానాలు దోహదం చేస్తాయి. యోగాభ్యాసం ప్రాధాన్యాన్ని అర్థం చేసుకుని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుందాం.
చక్కటి శరీరాకృతి, తరగని ఉత్సాహం, పొంగిపొర్లే ఆనందం, వయసుతో ప్రమేయం లేని ఆరోగ్యం... వీటన్నిటినీ యోగా గంపగుత్తగా ఇచ్చేస్తుంది. మనిషి చురకత్తిలా మారాలంటే మనసును, శరీరాన్ని ఏకంచేసే యోగ మార్గాన్ని అనుసరించాలి.
యోగా కాలాతీత ఆరోగ్య మార్గం. మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా చేయటమే దీని లక్ష్యం. ఆసనాలతో అవయవాలను మర్దన చేస్తూ.. చంచలమైన మనసుకు ధ్యానంతో కళ్లెం వేసి కూర్చోబెడుతూ.. ప్రాణాయామంతో ప్రాణశక్తి కేంద్రాలను ఉద్దీపన చేస్తూ శారీరకంగా, మానసికంగా మనిషిని అజేయ శక్తిగా మలుస్తుంది. శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటేనే మనిషి ‘సంపూర్ణ ఆరోగ్యం’తో ఉన్నట్టు. మనం ఎదుర్కొంటున్న అనేక రుగ్మతల నివారణకు యోగా ఓ ఉత్తమ సాధనంగా కనిపిస్తోంది. చాలా జబ్బుల్ని నయం చేసుకోవచ్చునని పలు పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి.
ముందస్తు మధుమేహం (ప్రి డయాబెటిస్) పూర్తిస్థాయి మధుమేహంగా మారే ముప్పు యోగ సాధనతో సుమారు 40% వరకు తగ్గుతున్నట్టు ఇండియన్ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటిస్ స్టడీలో వెల్లడైంది. దీర్ఘకాలం ప్రయోగ పరీక్షలు నిర్వహించి ఈ విషయాన్ని గుర్తించారు. ప్రాణాయామం, ధ్యానంతో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ తగ్గుతుంది. ఇన్సులిన్ సమర్థంగా పనిచేస్తుంది. ఆసనాలు వేస్తున్నప్పుడు కడుపు సంకోచించటం, వ్యాకోచించటం వల్ల క్లోమగ్రంథి ఉత్తేజితమవుతుంది. దీంతో మధుమేహ నివారణ, గ్లూకోజు నియంత్రణ జరుగుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.
మానసిక ఒత్తిడితో కార్టిసాల్ హార్మోన్ మోతాదులు పెరుగుతాయి. చక్కెర, కొవ్వులతో కూడిన పదార్థాలు తినాలనే కోరిక కలుగుతుంది. దీంతో బరువు పెరుగుతారు. యోగా ఒత్తిడిని తగ్గిస్తుంది. భావోద్వేగాలను మెరుగుపరచి తినాలనే కోరికను అదుపులో పెడుతుంది. యోగాతో కేలరీలూ ఖర్చవుతాయి. కండరాలు బలపడతాయి. అధిక బరువును తగ్గించుకోవాలని, బరువు పెరగకుండా చూసుకోవాలని అనుకునేవారికి యోగా మంచి మార్గం.
ప్రాణాయామం, ధ్యానం చేసే వారిలో అధిక రక్తపోటు, విశ్రాంతి సమయంలో గుండె వేగం, ఒత్తిడి తగ్గుముఖం పడుతున్నట్టు తేలింది. బొజ్జ, రక్తంలో కొలెస్ట్రాల్, గ్లూకోజు మోతాదులూ తగ్గుతాయి. ఇవన్నీ గుండెకు మేలు చేసేవే. రోజుకు రెండు సార్లు నెమ్మదిగా యోగా సాధన చేసేవారిలో గుండె లయ అస్తవ్యస్తం కావడం తగ్గుతున్నట్టు మరో అధ్యయనం పేర్కొంటోంది. గుండె విఫలమైనవారు 8 వారాల పాటు యోగా సాధన చేస్తే శ్రమను తట్టుకోవటం, రోజువారీ పనులు చేసుకోవటం మెరుగవుతున్నట్టూ బయటపడింది.
యోగాసనాలు, ప్రాణాయామంతో ఊపిరితిత్తుల సామర్థ్యం, శ్వాస తీసుకోవటానికి తోడ్పడే కండరాలు, రక్తంలోకి ఆక్సిజన్ మార్పిడి ప్రక్రియ పుంజుకుంటాయి. ఫలితంగా ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థ బలోపేతమవుతాయి. దీంతో ఆస్తమా, సీవోపీడీ వంటి జబ్బులు అదుపులో ఉంటాయి.
గుండెజబ్బులు, కీళ్లవాతం, క్యాన్సర్ల వంటి పలు రకాల జబ్బులకు ఒంట్లో కణస్థాయిలో జరిగే దీర్ఘకాల వాపు ప్రక్రియ(ఇన్ఫ్లమేషన్) కారణమవుతుంది. యోగా దీనికి కళ్లెం వేస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. యోగ సాధన చేసేవారిలో సి రియాక్టివ్ ప్రొటీన్, ఐఎల్-6, టీఎన్ఎఫ్-అల్ఫా వంటి వాపు ప్రక్రియ సూచికల మోతాదులు తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.
యోగాతో వేగస్ నాడి బలోపేతమవుతున్నట్టు, నాడీ వ్యవస్థ నియంత్రణలో ఉండటానికి తోడ్పడుతున్నట్టు బోస్టన్ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంటోంది. వేగస్ నాడి అనేది అతి పెద్ద కపాల నాడి. ఇది మెదడు నుంచి మొదలై శ్వాస, జీర్ణ, నాడీ వ్యవస్థలను చుడుతూ శరీరమంతా ప్రభావం చూపుతుంది. అందువల్ల ఈ నాడి మెరుగ్గా పనిచేస్తే శరీరం, మెదడు ఒత్తిడిని సమర్థంగా తట్టుకుంటాయి. ఆందోళన, ఉద్రిక్తత వంటి వాటిని తేలికగా ఎదుర్కోవటం సాధ్యమవుతుంది.
వెన్నుపాముకు దన్నుగా నిలిచే కండరాలను యోగా బలోపేతం చేస్తుంది. ఆసనాలు వేస్తున్నప్పుడు ఏకాగ్రతతో శ్వాస తీసుకోవటం మూలంగా ఒత్తిడి తగ్గి కండరాల బిగువు సడలుతుంది. నాడుల నుంచి మెదడుకు నిరంతరం నొప్పి సంకేతాలు అందటమూ తగ్గుతుంది. దీంతో నడుం, కండరాలు, కీళ్ల నొప్పుల వంటివి ఉపశమిస్తాయి.
ఈ వయసులో ఎందుకు?... అని పిల్లలు ఈ వయసులో చేయలేంలే... అని పెద్దవాళ్లు అనుకోడానికి వీల్లేదు. జీవితంలోని ప్రతి దశలో యోగా ప్రభావాన్ని చూపుతుంది. ఏ వయసు వారు ఏం చేయొచ్చంటే...
పిల్లలకు ఈ వయసులో శరీరం ఎలాగైనా ఒంగుతుంది. వారికి యోగా ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక శాంతి, ఏకాగ్రత పెంచవచ్చు. రోజూ కనీసం ఓ 30 నిమిషాలైనా వారికి యోగాను అలవర్చాలి.
తాడాసనం, భుజంగాసనం, బాలాసనాలతో పాటు ప్రాణాయామం ఈ వయసు పిల్లలకు నేర్పాలి.
బాల్యం నుంచి యవ్వనంలోకి ప్రవేశించే దశ. శారీరకంగా, మానసికంగా పరిపక్వత వచ్చే వయసిది. చదువు, ఉద్యోగాల ఒత్తిడి మొదలవుతుంది. దురలవాట్లకు బీజం పడేది ఈ వయసులోనే. మనసును నియంత్రించుకోవడంలో కీలకమైన దశ ఇది. యోగా ద్వారా శరీర దృఢత్వంతోపాటు మానసిక విశ్రాంతి లభిస్తుంది.
సూర్య నమస్కారాలు స్థిరమైన చిత్తాన్నివ్వడంతో పాటు హార్మోన్ల సమతూకాన్ని నిలుపుతాయి. శలభాసనం, ధనురాసనం, పశ్చిమోత్తాసనం వంటివి మేలు చేస్తాయి.
ఉద్యోగమని, కుటుంబ బాధ్యతలనీ అనేక ఒత్తిళ్లుండే దశ. బాధ్యతలు పెరిగేకొద్దీ.. మానసిక విశ్రాంతి, శరీర ఆరోగ్యంపై అశ్రద్ధ వహిస్తారు చాలామంది. నీరసం, నిద్రలేమి, జీర్ణసంబంధ సమస్యలు, అలసట వంటివాటితో సతమతమవుతుంటారు. ప్రాణాయామం, ధ్యానం మనసును ప్రశాంతంగా ఉంచుతాయి. ఆసనాలు శరీరంలోని రుగ్మతలను తగ్గిస్తాయి. కండరాలను బలపరుస్తాయి.
పవనముక్తాసనం, వజ్రాసనం, అర్ధమత్స్యేంద్రాసనంతో పాటు ప్రాణాయామంతో శక్తిమంతమైన జీవనశైలి సాధ్యమవుతుంది. నిద్ర నాణ్యత పెరుగుతుంది.
ఈ దశలో శారీరక, మానసిక, జీవనశైలిలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగ ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, ఆహారపు అలవాట్లు, వ్యాయామ లోపం వంటి కారణాలతో ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. బీపీ, డయాబెటిస్, ఊబకాయం, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి, ఆందోళన, ఒత్తిడి, నిద్రలేమి, మహిళల్లో హార్మోన్ల మార్పులు, మెనోపాజ్ సమస్యలు ఈ వయసులోనే వస్తాయి. యోగా వీటిని చాలా వరకు నియంత్రిస్తుంది.
మకరాసనం, శవాసనం, ఉత్తానపాదాసనం, ప్రాణాయామాలతో షుగర్, బీపీ వంటి జీవనశైలి వ్యాధులపై నియంత్రణ సాధించవచ్చు.
వయసు పెరిగాక శరీరంలో శక్తి సన్నగిల్లుతుంది. ఈ సమయంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలు. ఏ అనారోగ్య సమస్య తలెత్తినా..అన్నింటికీ మందులు వాడుతుంటారు. అయితే శరీరాన్ని సహజ మార్గంలో దృఢంగా ఉంచే సమర్థమైన మార్గం యోగా. రోజూ కొద్దిసేపు యోగా చేయడం ద్వారా ఆరోగ్యంగా, ఆనందంగా గడిపేందుకు వీలుంటుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.