
‘మంచి భార్య, తల్లి, వ్యాపారవేత్తగా మా జీవితాల్లో భువనేశ్వరి వెలుగులు నింపారు’ అంటూ సీఎం చంద్రబాబు తన సతీమణికి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, జూన్ 20(ఆంధ్రజ్యోతి): ‘మంచి భార్య, తల్లి, వ్యాపారవేత్తగా మా జీవితాల్లో భువనేశ్వరి వెలుగులు నింపారు’ అంటూ సీఎం చంద్రబాబు తన సతీమణికి ఎక్స్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘సమాజంలో మంచి మార్పు తీసుకురావాలనే ఆమె తపన ఎంతోమందికి స్ఫూర్తినిస్తోంది. ఒక అద్భుత వ్యక్తిని తన జీవిత బాగస్వామిగా పొందాను. ప్రతిరోజూ మా జీవితాలను ప్రకాశవంతంగా మారుస్తున్నందుకు భువనేశ్వరికి ధన్యవాదాలు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. కాగా, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సీఎం చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
‘ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే ధైర్యం ఆమె సొంతం. ఇతరులకు సాయం కోసం ఆమె చూపిస్తున్న అంకితభావం స్ఫూర్తిదాయకం. ప్రేమ, ఆదర్శవంతమైన మార్గదర్శకత్వంతో రోజూ మా జీవితాలను తీర్చిదిద్దుతున్న విలువల తల్లికి ధన్యవాదాలు. ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉంటూ ఇలాగే సేవలందించాలని ఆకాంక్షిస్తున్నా’ అంటూ లోకేశ్ తన తల్లి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
టీడీపీ కార్యాలయంలో భువనేశ్వరి జన్మదిన వేడుకలు
సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి జన్మదిన వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి సవిత ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏపీ గౌడ కార్పొరేషన్ చైర్మన్ వీరంకి గురుమూర్తి, ఏపీ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం, మీడియా కో-ఆర్డినేటర్ దారపనేని నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.