
AP EAPCET 2026 Results update | గాంధీనగర్ (కాకినాడ): లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఏపీ ఎప్సెట్ ఫలితాల(AP EAPCET 2026 Results)పై కీలక అప్డేట్!
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఎప్సెట్ ఫలితాలను ఈ నెలాఖరుకు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే వీసీ సీఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు.
మే 12 నుంచి 20 వరకు ఎప్సెట్ పరీక్షలు జరగ్గా.. దాదాపు 3.29లక్షల మందికి పైగా విద్యార్థులు రాశారు. షెడ్యూల్ ప్రకారమైతే జూన్ 1 నాటికే ఫలితాలు వెలువడాల్సింది. కానీ, ఎప్సెట్లో ఇంటర్ మార్కులకు 25% వెయిటేజీ ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ద్వితీయ ఇంటర్ విద్యార్థులకూ ఇంప్రూవ్మెంట్ రాసేందుకు అవకాశం కల్పించడంతో అనేకమంది తమ మార్కుల మెరుగుదలకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. ఎప్సెట్ ర్యాంకుల్లో వీరికి ఎట్టిపరిస్థితుల్లో అన్యాయం జరగకూడదన్న సదుద్దేశంతో ప్రభుత్వం తొలుత ఈ ఫలితాలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. ఈ నెల 18న ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కావడంతో నేడో, రేపో ఎప్సెట్ ర్యాంకులూ ప్రకటిస్తారని వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఏడాది సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలకు సంబంధించి సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు తలెత్తడంతో ఎప్సెట్ ఫలితాల విడుదలపై మరోసారి జాప్యం నెలకొంది.
సీబీఎస్ఈ రివైడ్జ్ ఫలితాలను ఈ నెలాఖరు నాటికి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దాదాపు 8వేల మంది వరకు సీబీఎస్ఈ విద్యార్థులు ఎప్సెట్ రాశారు. దీంతో ఎప్సెట్ ఫలితాలు వారం రోజులు ఆలస్యమైనా సరే.. ఏ ఒక్క విద్యార్థికీ అన్యాయం జరగకుండా చూడాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారని ఎప్సెట్ ఛైర్మన్ సీఎస్ఆర్కే ప్రసాద్ తెలిపారు. అందువల్ల సీబీఎస్ఈ 12వ తరగతి రీవాల్యుయేషన్ ఫలితాలు వెలువడిన అనంతరం ఎప్సెట్ ర్యాంకులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపారరకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.