
వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
హైదరాబాద్, జూన్ 20, (ఆంధ్రజ్యోతి): వీబీజీ రామ్‌జీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నిరసన లేఖ రాశామని మంత్రి సీతక్క (Telangana Minister Seethakka) పేర్కొన్నారు. నూతన చట్టాన్ని ఉపసంహరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. నూతన చట్టంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మూడు వేర్వేరు లేఖలు కేంద్రానికి పంపించామని వెల్లడించారు. ఈరోజు (శనివారం) హైదరాబాద్‌లోని సచివాలయంలో మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ను యథాతథంగా కొనసాగించి గ్రామీణ పేదల ఉపాధి హక్కును కేంద్రం కాపాడాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల అధికారాలను బలహీనపరిచే నిబంధనలని వెంటనే సవరించాలని విజ్ఞప్తి చేశారు. వీబీజీ రామ్‌జీ నిధుల కేటాయింపు విధానం పేదలు, దళితులు, గిరిజనులకు అన్యాయం చేస్తోందని పేర్కొన్నారు.
పనిదినాల ఆధారంగానే నిధుల కేటాయింపు జరగాలి..
రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా చూడకుండా గ్రామస్థాయి ఉపాధి అవసరాలను పరిగణనలోకి తీసుకోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదిలాబాద్, ములుగు, కుమురంభీం, ఆసిఫాబాద్ వంటి వెనుకబడ్డ ప్రాంతాల అవసరాలు విస్మరించొద్దని అన్నారు. గ్రామ పంచాయతీల్లో నమోదైన వాస్తవ పనిదినాల ఆధారంగానే నిధుల కేటాయింపు జరగాలని సూచించారు. నిధుల పంపిణీ విషయంలో కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పుకొచ్చారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వీబీజీ రామ్‌జీ పరిధిలో అనుమతించాలని కోరారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు గతంలోలాగే 90 రోజుల ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత భూ అభివృద్ధి పనులను తొలగిస్తే చిన్న రైతులకు నష్టమని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, చిన్న సన్నకారు రైతులకు ఉపయోగపడే జీవనోపాధి పనులను కొనసాగించాలని మంత్రి సీతక్క సూచించారు. వరదలతో దెబ్బతిన్న భూముల పునరుద్ధరణ, న్యూట్రి గార్డెన్లు, వెదురు తోటలకు అనుమతి ఇవ్వాలని కోరారు. 60 రోజుల తప్పనిసరి ఉపాధి విరామం గ్రామీణ పేదల ఆదాయాన్ని దెబ్బతీస్తుందని అన్నారు. ఆదివాసీ గిరిజన ప్రాంతాలు, నీటి ఎద్దడి ప్రాంతాలకు 60 రోజుల నిషేధం నుంచి మినహాయింపు ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ అనుబంధ పనులకు ఏడాది పొడవునా ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొక్కల పెంపకం, అటవీకరణ కార్యక్రమాలకు ఉపాధి విరామం వర్తింపజేయొద్దని అన్నారు. దళితులు, గిరిజనులు, భూమిలేని కుటుంబాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చట్టంలో మార్పులు చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
ప్రభుత్వ భూములు కబ్జా చేయాలని చూస్తే కఠిన చర్యలు.. సీఎం వార్నింగ్
వీకెండ్లో సిరిసిల్లకు వచ్చి వెళ్లిపోతారు.. కేటీఆర్‌పై కవిత సెటైర్లు
Read Latest Telangana News And AP News And National News