
Deewana telugu movie review || చిత్రం: దీవాన; నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు; నిర్మాణం: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి;...
Deewana telugu movie review || చిత్రం: దీవాన; నటీనటులు: హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై, వీకే నరేష్, ఝాన్సీ, బలగం వేణు, నర్సింగ్, టోనీ, తదితరులు; నిర్మాణం: వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి; దర్శకత్వం: శ్రీకాంత్ సంగిశెట్టి; సంస్థలు: అర్హ మీడియా, వి.స్టూడియోస్; విడుదల: 20-06-2026
‘కల్కి’, ‘శుభం’ తదితర సినిమాల్లో నటించిన హర్షిత్‌రెడ్డి కథానాయకుడిగా రూపొందిన ప్రేమకథా చిత్రం ‘దీవాన’. గీతా ఫిలిం డిస్ట్రిబ్యూషన్ సంస్థపై విడుదలైన ఈ సినిమా బలమైన ప్రచార కార్యక్రమాలతో ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. ఈ మూవీ ఎలా ఉంది? ఎలాంటి వినోదాన్ని పంచింది?
మున్నా (హర్షిత్‌రెడ్డి) డిగ్రీ పూర్తి చేసిన ఓ కుర్రాడు. ఏ పనీ చేయకుండా తల్లిదండ్రులు (వీకే నరేశ్, ఝాన్సీ) కష్టంపైనే ఆధారపడుతూ స్నేహితులు, సరదాలు, గ్యాంగ్ ఫైట్లు అంటూ జీవితాన్ని గడిపేస్తుంటాడు. ఇంట్లోవాళ్లు చిన్న పని చెప్పినా చిరాకు పడుతుంటాడు. అలాంటి మున్నా అనుకోకుండా అమూల్య అలియాస్ అమ్ము ( స్మేహ మణిమేఘలై)ని చూసి మనసు పారేసుకుంటాడు. ప్రపంచంలో తనకంటే అందమైన అమ్మాయి లేనే లేదనేది తన అభిప్రాయం. ఆమె పనిచేసే చోటు ఎక్కడో తెలిసిపోవడంతో రోజూ అక్కడకు వెళుతూ తన ప్రేమ విషయాన్నీ బయటపెడతాడు. ఆమె మాత్రం అతని ప్రేమని ఎంతకీ అంగీకరించదు. అయినా సరే, ఆమెపై ఉన్న ప్రేమని చంపుకోడు. అతని ప్రయత్నం ఎంతకీ ఆగదు. దాంతో ఒక రోజు ‘ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి, అప్పుడు రా’ అని షరతు పెడుతుంది. అమూల్య మనసుని గెలుచుకునేందుకు ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని నిర్ణయించుకుంటాడు మున్నా. అంతలోనే అనూహ్యంగా అతని జీవితం మలుపు తిరిగి కటకటాల్లోకి వెళ్లాల్సి వస్తుంది. మరి ఉద్యోగం సంగతి ఏమైంది?అమూల్య ప్రేమని గెలుచుకున్నాడా? అసలింతకీ మున్నా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సిన అవసరం ఎందుకొచ్చిందనే విషయాల్ని తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
కథగా చూస్తే ఇందులో ఏముంది?చిన్న లైన్, అది కూడా చాలా సినిమాల్లో చూసిందే కదా అనే అభిప్రాయం కలగొచ్చు. కానీ నేటితరం దర్శకులు తెలిసిన కథల్నే సరికొత్తగా, ట్రెండ్‌కి తగ్గట్టుగా తెరపై ఆవిష్కరించడంపై దృష్టిపెడుతున్నారు. ఆ ప్రయత్నంలో అనుకున్నట్టుగా భావోద్వేగాలు, సంఘర్షణ పండాయంటే చాలు... ప్రేక్షకులకు నచ్చేస్తుంటాయి. ఇది కూడా ఆ జాబితాలోకి చేరగలిగే సినిమానే. వన్‌సైడ్ ప్రేమకథకు నేటి ట్రెండ్‌లో భాగమైన షాకింగ్ ఫ్యాక్టర్ని మేళవించిన విధానమే ఈ సినిమాని ప్రత్యేకంగా నిలబెడుతుంది. ప్రేమతోపాటు, స్నేహం, కుటుంబం చుట్టూ మలిచిన సన్నివేశాలూ మనసుల్ని హత్తుకునేలా భావోద్వేగాల్ని పండించడంతో ఈ సినిమాకి అన్నీ పక్కాగా కలిసొచ్చినట్టైంది.
పోలీస్ స్టేషన్ నుంచి ఈ కథ మొదలవుతుంది. హీరో తనలాగే స్టేషన్‌కి వచ్చిన ఓ గ్యాంగ్‌కి తన కథని చెబుతాడు. హీరో చేసే అల్లరి నేపథ్యంలో ఆరంభ సన్నివేశాలు సరదా సరదాగా సాగిపోతాయి. అమూల్య తారసపడటం నుంచే ఇదొక ప్రేమకథగా మలుపు తీసుకుంటుంది. అమూల్య చుట్టూ హీరో తిరగడం, తన ప్రేమని వ్యక్తం చేసేందుకు ఎంచుకునే దారులు, కథానాయిక స్నేహితురాలు సహాయం చేసే సన్నివేశాలు, పాటల అలరిస్తుంది. అందరినీ షాక్‌కి గురిచేసే అంశంతో కూడిన విరామ సన్నివేశాలు సినిమాని అనూహ్యమైన మలుపు తిప్పుతాయి. నేటి ట్రెండ్‌కి అద్దం పట్టే ఆ సన్నివేశాలతో సినిమా మరోస్థాయికి వెళ్లింది.
ద్వితీయార్ధంపైనా అంతే పట్టుని ప్రదర్శిస్తూ భావోద్వేగాలతో కట్టిపడేశాడు దర్శకుడు. యువతరం మెచ్చే అంశాలతోపాటు, హీరో కుటుంబ నేపథ్యంలో బలమైన సంఘర్షణని ఆవిష్కరిస్తూ సన్నివేశాల్ని మలిచారు. స్నేహితుడికి సమస్య ఎదురైందని తెలిసినప్పుడు తమ మధ్య ఎన్ని సమస్యలున్నా మళ్లీ కలిసిపోయి ఒకరికొకరు నిలబడటం, ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు, పోలీస్ స్టేషన్ నుంచి తండ్రీ, కొడుకు బయట పడటం, ఆ తర్వాత చోటు చేసుకునే పరిణామాలు ద్వితీయార్ధానికి కీలకం. పోలీస్‌స్టేషన్‌లో హీరోకి లాయర్ చెప్పే మాటలు, తండ్రి కష్టం గురించి అదుర్స్ రఘు వివరించడం, హీరోయిన్ మనసులోని ప్రేమని బయటపెట్టే సన్నివేశాలు భావోద్వేగాలతో హృదయాల్ని బరువెక్కిస్తాయి. విరామానికి ముందు తరహాలోనే, పతాక సన్నివేశాల్లోనూ ఓ షాకింగ్ ఎలిమెంట్ ఉంటుంది. దర్శకుడి రచనలోని బలానికి అద్దం పట్టే ఆ సన్నివేశాలతో ప్రేమలోని సంఘర్షణని పక్కాగా ఆవిష్కరించింది.
కథానాయకుడు హర్షిత్‌రెడ్డి తనలో ఎంత మంచి నటుడు ఉన్నాడో ఈ సినిమాతో మరోసారి చూపించాడు. పాత్రలో సహజంగా ఒదిగిపోయాడు. ఆయన సంభాషణలు చెప్పిన విధానం, భావోద్వేగాలు పండించిన తీరు సినిమాపై గొప్ప ప్రభావం చూపించింది. కథానాయిక స్మేహ అందంగా కనిపిస్తూనే మంచి నటనని ప్రదర్శించారు. ఇలాంటి పాత్రని ఎంపిక చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి. ఆమె స్నేహితురాలి పాత్ర కూడా గుర్తుండిపోతుంది. ఇక కథానాయకుడి స్నేహితుల పాత్రలకీ సినిమాలో చాలా ప్రాధాన్యం ఉంది. హీరోతోపాటే కనిపించే ఆ పాత్రల్లో సహజంగా ఒదిగిపోయారు. తండ్రి పాత్రలో వీకే నరేశ్ మరోసారి మెరిశారు. ఎక్కువ మాటల్లేకుండానే ఆ పాత్రపై ప్రభావం చూపించారు. తల్లి పాత్రలో కనిపించిన ఝాన్సీ, ఆమె మాటలు సినిమాకి మరింత అందాన్ని తీసుకొచ్చాయి. బలగం వేణు, రఘు సహా మరికొంతమంది నటులు కనిపించేది కొద్దిసేపే అయినా సినిమాకి కీలకంగా మారాయి వాళ్ల పాత్రలు. సాంకేతిక విభాగాలన్నీ మంచి పనితీరునే కనబరిచాయి. ఈశ్వర్ చంద్ పాటలు, వంశీ కెమెరా పనితనం మెప్పిస్తాయి. దర్శకుడికి ఇదే తొలి చిత్రమైనా కథని రాసుకున్న తీరు, దాన్ని తెరపైకి తీసుకొచ్చిన విధానంలో స్పష్టత కనిపించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.