
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ టీ20 లీగ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ లీగ్ ఆరంభమయ్యేది ఆదివారమే.
ఐపీఎల్ తరహాలో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఈ లీగ్ తొలి సీజన్లో ఎనిమిది జట్లు పోటీపడుతున్నాయి. రామోజీ గ్రూప్‌నకు చెందిన హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్, రంగారెడ్డి రైజర్స్, మెదక్ ఫాల్కాన్స్, వరంగల్ వారియర్స్, పాలమూరు స్ట్రెకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్, కరీంనగర్ డైమండ్స్, నల్గొండ నైట్స్ కదనానికి కాలుదువ్వుతున్నాయి. యువ ప్రతిభావంతులు, అనుభవజ్ఞుల సమ్మేళనంగా ఉన్న హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ జట్టు ట్రోఫీపై కన్నేసింది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ పోటీల కోసం ముస్తాబైంది. ఈ లీగ్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ నటించిన అధికారిక గీతాన్ని శుక్రవారం టీజీ20 నిర్వాహకులు విడుదల చేశారు. ఎందరో యువ క్రికెటర్ల ఆశలకు వేదికగా నిలుస్తూ, తెలంగాణ క్రికెట్లో నూతన అధ్యాయంగా ఈ టోర్నీ ఉండబోతుందని ఈ పాట ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఆదివారం రాత్రి 7:15కు పాలమూరు, ఖమ్మం జట్ల మధ్య తొలి మ్యాచ్ ఆరంభంకానుంది. అంతకుముందు 5:30కి మొదలయ్యే ఆరంభ వేడుకల్లో సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ అలరించనున్నాడు. స్టార్‌స్పోర్ట్స్ నెట్వర్క్, జియో హాట్‌స్టార్‌లో మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.