
Reliance Jio IPO | ఇంటర్నెట్ డెస్క్: మదుపరులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘జియో ఐపీఓ’కు సంబంధించి కీలక్ అప్డేట్ వచ్చేసింది.
ఈ ఐపీఓకు (Jio IPO) సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది. అంతకుముందు జియో ప్లాట్‌ఫామ్స్ బోర్డు డీహెచ్ఆర్పీకి ఆమోదం తెలిపింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో ఐపీఓ పత్రాలను నేడే సమర్పించనున్నట్లు ముకేశ్ అంబానీ వెల్లడించిన కాసేపటికే సెబీకి ఈ పత్రాలు చేరాయి.
‘‘ఇది నాతో పాటు రిలయన్స్ కుటుంబానికి, కోట్లాది మంది వాటాదారులకు భావోద్వేగభరిత క్షణం. జియో ఐపీఓకు సంబంధించిన డ్రాఫ్ట్ పేపర్లను బోర్డు ఆమోదించింది. ఈ రోజే సెబీకి సమర్పిస్తాం. ఈ ఏడాది రిలయన్స్ (Reliance Industries)కు జియో ఐపీఓ అత్యంత ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుంది. ఇది మా వాటాదారులకు గణనీయమైన విలువను అందించడంతో పాటు కొత్త పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన పెట్టుబడి అవకాశాన్ని కల్పిస్తుందని విశ్వసిస్తున్నా. ప్రపంచ స్థాయి సామర్థ్యం కలిగిన సాంకేతిక సంస్థలను భారత్ నిర్మించగలదని జియో లిస్టింగ్ ప్రపంచానికి నిరూపిస్తుంది’’ అని ముకేశ్ అంబానీ వెల్లడించారు.
ఈ ఐపీఓ ద్వారా సుమారు 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.25వేల కోట్ల పైచిలుకు) నిధులు సేకరించాలని భావిస్తున్నారు. ఈ పబ్లిక్ ఇష్యూలో 27 కోట్ల కొత్త షేర్లను ఇన్వెస్టర్లకు జారీ చేయనున్నారు. ఐపీఓ ద్వారా వచ్చే మొత్తాన్ని కంపెనీ తీసుకున్న అప్పులను తీర్చడానికి ఉపయోగించనున్నారు. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాల కోసం ఉపయోగిస్తారు. డ్రాఫ్ట్ పేపర్లు దాఖలు చేసే నాటికి.. ప్రమోటర్ సంస్థ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో 66.43 శాతం వాటా ఉంది.
గతేడాది నిర్వహించిన రిలయన్స్ ఏజీఎం సందర్భంగా జియో ఐపీఓ గురించి ముకేశ్ అంబానీ ప్రకటన చేశారు. 2026కు తొలి అర్ధభాగంలోనే జియో ఐపీఓ ఉంటుందని అప్పట్లో తెలిపారు. అయితే, ఈ ఏడాదిలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు విలువ క్షీణించడం, పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల రిలయన్స్ ప్రధాన ఆదాయ వనరు అయిన పెట్రోకెమికల్ వ్యాపారంపై ప్రభావం పడడం వంటి పరిణామాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశం ప్రత్యప్రసారం మీ కోసం...