
చుంచుపల్లి, జూన్ 19 : చుంచుపల్లి మండలంలో పింఛన్ లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ 83 శాతం పూర్తయినట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపారు. ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల మేరకు మండలంలోని పింఛన్ లబ్ధిదారుల వివరాల ధ్రువీకరణ కార్యక్రమం కొనసాగుతుందని ఆమె వెల్లడించారు.
మండలంలో మొత్తం 3,815 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా, ఇప్పటివరకు 3,087 మంది ఆధార్ అథెంటిఫికేషన్ పూర్తి చేసుకున్నట్లు తెలిపారు. ఇంకా 628 మంది లబ్ధిదారులు అథెంటిఫికేషన్ చేయించుకోవాల్సి ఉందన్నారు. పరిశీలనలో 100 మంది పింఛన్దారులు మృతి చెందినట్లు గుర్తించగా, వారిలో ఎనిమిది మంది వివరాలు ఇంకా నిర్ధారణకు రావాల్సి ఉందన్నారు.
అదేవిధంగా ముగ్గురు లబ్ధిదారుల ఆధార్ అథెంటిఫికేషన్ సాంకేతిక కారణాలతో సక్రమంగా నమోదు కాలేదని, వారి వివరాలను సరిచేసే చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నడవలేని వారు, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధుల కోసం సిబ్బంది నేరుగా వారి ఇళ్లకు వెళ్లి ఆధార్ అథెంటిఫికేషన్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
కొంతమంది పింఛన్ లబ్ధిదారులు ఇతర జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఉండటంతో వారి కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాల ప్రజల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు వివరించారు. ఆధార్ అథెంటిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ వరకు గడువు నిర్ధేశించిందని, అర్హులైన లబ్ధిదారులు వెంటనే తమ వివరాలను ధ్రువీకరించుకోవాలని ఎంపీడీఓ సూచించారు.
మిగిలిన లబ్ధిదారులందరి అథెంటిఫికేషన్ను గడువు తేదీలోపు పూర్తి చేయడానికి అధికారులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు
.