
Maa Inti Bangaram: సమంత 'మా ఇంటి బంగారం' మూవీ రివ్యూ.. ఎక్కడో తేడా కొట్టిందే! Maa Inti Bangaram: 'ఖుషీ' సినిమా తర్వాత దాదాపు మూడేళ్ల గ్యాప్ తీసుకుని టాలీవుడ్లో సమంత నటించిన చిత్రం 'మా ఇంటి బంగారం'. 'ఓ బేబీ' వంటి సూపర్ హిట్ తర్వాత దర్శకురాలు నందిని రెడ్డి, సమంత కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి.
మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో పూర్తి సమీక్షలో చూద్దాం. స్వర్ణ అలియాస్ ఝాన్సీ (సమంత) ఒక అనాథ. చిన్నప్పటి నుంచి తనకు కూడా ఒక పెద్ద కుటుంబం ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలోనే పెద్ద కుటుంబం ఉన్న అనిరుద్ (దిగంత్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.
అయితే, ఇష్టం లేని పెళ్లి కావడంతో ఆ కుటుంబం వీరిద్దరినీ దూరం పెడుతుంది.పెళ్లయిన మూడేళ్ల తర్వాత ఆ ఇంట్లో జరిగే ఒక శుభకార్యం కోసం స్వర్ణ, ఆమె భర్త తిరిగి వస్తారు. తన మంచి మనసుతో తక్కువ సమయంలోనే ఇంట్లో వాళ్లతో కలిసిపోతుంది స్వర్ణ.
కానీ, అంతలోనే ఆమె గతం ఆ కుటుంబాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. జైల్లో ఉన్న నక్సలైట్ కరుణతో స్వర్ణకు ఉన్న వైరం కారణంగా ఆ కుటుంబానికి ముప్పు వస్తుంది. అప్పుడు తన కుటుంబం కోసం స్వర్ణ ఏం చేసింది? వాళ్లకు తన గతం చెప్పి ఎలా కాపాడుకుంది?
అనేదే మిగిలిన కథ. 'మా ఇంటి బంగారం' అనేది ఒక పాత ఫార్మాట్ కమర్షియల్ కథ. సాధారణంగా స్టార్ హీరోల ఓరియెంటెడ్‌గా వచ్చే 'బాషా' తరహా ఫ్లాష్‌బ్యాక్ టెంప్లేట్‌ను, ఇక్కడ హీరోయిన్ ఓరియెంటెడ్‌గా మార్చడం కొంతవరకు కొత్తదనాన్ని ఇచ్చింది.
పెద్ద ఇంటికి కోడలిగా వచ్చిన హీరోయిన్‌కు ఊహించని మాస్ గతం ఉండడం, ఆమె స్క్రీన్‌పైకి వచ్చినప్పుడల్లా ఈమె ఎవరో తెలుసా? అనే రేంజ్ ఎలివేషన్స్ ఇవ్వడం మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి భాగం మొత్తం
కుటుంబ సన్నివేశాలతో నెమ్మదిగా సాగుతుంది. అక్కడక్కడా కొన్ని ఆసక్తికరమైన సీన్స్ ఉన్నప్పటికీ, రాజ్ నిడిమోరు మార్క్ రైటింగ్ ఆశించిన స్థాయిలో కనిపించదు. ఇంటర్వెల్ సమయానికి కథ ఊపందుకుంటుంది. ద్వితీయార్థం యాక్షన్ సీన్స్‌తో జోరందుకుంటుంది. సమంత అసలు రూపం తెలిసిన తర్వాత వచ్చే ఫైట్స్, ముఖ్యంగా ఫ్యామిలీపై ఎటాక్ జరిగినప్పుడు వచ్చే సమంత మేకోవర్ ఒక స్టార్ హీరో రేంజ్ ఎలివేషన్‌ను తలపిస్తుంది.
సినిమాకు అతిపెద్ద మైనస్ రొటీన్ కథాంశం. ఎన్నో సినిమాల్లో చూసిన కథనే మళ్లీ రాయడం వల్ల కొత్తదనం లోపించింది. కొన్ని సీన్లు కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. అలాగే విలన్ ట్రాక్ ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది.
సమంత ఈ సినిమాకు కర్త, కర్మ, క్రియ సమంతే. తన స్టార్ పవర్‌తో సినిమాను ఒంటిచేత్తో నడిపించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టింది. అయితే, లుక్స్ పరంగా సమంత గత చిత్రాలంతగా ఇందులో పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.సమంత భర్త పాత్రలో దిగంత్ బాగానే నటించాడు. అయితే టాలీవుడ్లో మరింత పరిచయం ఉన్న నటుడిని పెట్టి ఉంటే బాగుండేది. విలన్‌గా గుల్షన్ దేవయ్య నటన బాగున్నా, ఆయన క్యారెక్టరైజేషన్ చాలా వీక్‌గా ఉండడం మైనస్. శ్రీముఖి, చైతన్య కృష్ణ, శ్రీలక్ష్మి, ఆనంద్ తమ పాత్రల పరిధి మేరకు న్యాయం చేశారు.
సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. ఎలివేషన్ సీన్స్‌ను బాగా ఎలివేట్ చేసింది. నందిని రెడ్డి తన మేకింగ్‌తో మెప్పించింది. రాజ్ నిడిమోరు అందించిన కథ పాతదే అయినా, స్క్రీన్‌ప్లే ఓ మోస్తరుగా ఉండడం సినిమాను కాపాడింది. విజువల్స్ చాలా బాగున్నాయి. అయితే ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త పడాల్సింది. వెబ్ సిరీస్ తరహాలో అక్కడక్కడా కథనం నెమ్మదిస్తుంది.
'మా ఇంటి బంగారం'.. మెరిసేదంతా బంగారం కాకపోయినా, కమర్షియల్ కోటింగ్ మాత్రం బాగానే వేశారు. సమంత పవర్ ప్యాక్డ్ యాక్షన్ పర్ఫార్మెన్స్ కోసం, ఫ్యామిలీ ఎలిమెంట్స్ కోసం ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఓవరాల్‌గా ఇది ఒక యావరేజ్ కమర్షియల్ ఎంటర్టైనర్.