
గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ సమయంలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. ఆ తర్వాత మళ్లీ పెరగ్గా.. ఇప్పుడు యుద్దం ముగిసిపోవడంతో మళ్లీ తగ్గుతున్నాయి. ఈ పతనం ఇలాగే ఉంటుందా..
లేదా మళ్లీ పెరుగుతాయా.. రానున్న రోజుల్లో ధరలు ఎలా ఉంటాయనే దానిపై అందరిలోనూ ఆసక్తి పెరుగుతోంది. ఇంతకు రాబోయే రోజుల్లో బంగారం ధరల అంచనాలు ఎలా ఉన్నాయో చూద్దాం. రాబోయే నెలల్లో బంగారం ధరలు 40 శాతం వరకు పెరగవచ్చట. ఈ మేరకు ప్రముఖ సంస్థ జేపీ మోర్గాన్ అంచనా వేసింది.
ఇదే నిజమైతే గోల్డ్ రేట్లు సరికొత్త రికార్డ్ దిశగా దూసుకెళ్లవచ్చు. ఈ ఏడాది నాల్గవ త్రైమాసికం నాటికి బంగారం ధర ఔన్సుకు సగటున 6 వేల డాలర్లకు పెరుగుతాయట. ఇక 2027 నాటికి 6300 డాలర్లకు చేరుకునే అవకాశముందని తన అంచనాల్లో పేర్కొంది.
ప్రస్తుత ధరలతో పోలిస్తే.. దాదాపు 40 శాతం పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2026లో ఇరాన్ చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు, తదనంతర పరిణామాలు ముడి చమురుకు అతిపెద్ద సవాలుగా నిలిచాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి ధరలు 20 శాతం మేర పడిపోయాయి.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య పెరిగిన ఉద్రిక్తతలు ముడి చమురు ధరలను మరింతగా పెంచాయి. చమురు ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళనలను కూడా పెంచింది. దీంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను దీర్ఘకాలం పాటు అధికంగా ఉంచగలదనే వార్తలు బలంగా వినిపించాయి.
బంగారం వడ్డీని సంపాదించదు. అందువల్ల వడ్డీ రేట్లు అధికంగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు బాండ్లు, ఇతర వడ్డీ చెల్లించే ఆస్తుల వైపు చూస్తారు. దీని వల్ల బంగారంపై ఒత్తిడిని కొనసాగుతుంది. ఫెడరల్ రిజర్వ్ విధానాలు, బలమైన డాలర్, ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంక్ కొనుగోళ్లు వంటి ఇతర అంశాలు బంగారం ధరను
పరిమిత స్థాయిలో ఉంచుతున్నాయి.
జేపీ మోర్గాన్ అంచనా నిజమైతే భారత్లో 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ. 2.13 లక్షలకు చేరవచ్చు. ఇదే జరిగతే బంగారం మరింత ప్రియం కానుంది. బంగారంపై పెట్టుబడులు పెట్టినవారు లాభపడనున్నారు. మరి ఈ అంచనాలు నిజమవుతాయా.. లేదా అనేది చూడాలి.