రేప్ కేసులో అరెస్టయ్యి జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ 18 ఏళ్ల యువకుడు ఇప్పుడు నీట్ ఎగ్జామ్‌కి సిద్ధమయ్యాడు. ఇది వినగానే మీకు తెలుగు సినిమా గుర్తుకు వచ్చింది కదా. ఇటీవల వచ్చిన యుఫోరియా సినిమాలో కూడా రేప్ కేసులో శిక్ష అనుభవిస్తున్న ఓ 18 ఏళ్ల యువకుడు కూడా ఇలానే ఎగ్జామ్ రాసేందుకు సిద్ధమవుతాడు.
అందులో బాధితురాలే జడ్జిగా మారి బెయిల్ కూడా మంజూరు చేస్తుంది. ఇక్కడ కూడా బాధితురాలు బెయిల్‌కు అభ్యంతరం లేదని చెప్పడం విశేషం.ముంబైలోని ప్రత్యేక పోక్సో కోర్టు 18 ఏళ్ల యువకుడికి నీట్ రీ ఎగ్జామ్ రాసేందుకు నాలుగు రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.
నవీ ముంబైలోని తలోజా సెంట్రల్ జైలులో ఉన్న ఈ యువకుడు జూన్ 21న జరగనున్న నీట్ రీ ఎగ్జామ్‌కు హాజరయ్యేందుకు కోర్టును ఆశ్రయించగా, ప్రత్యేక న్యాయమూర్తి పిటిషన్‌ను విచారించి బెయిల్ మంజూరు చేశారు. బాధితురాలు కానీ, ఆమె కుటుంబ సభ్యులు కానీ యువకుడిపై ఎలాంటి బెదిరింపులకు పాల్పడకూడదని కోర్టు ఆదేశించింది.
పరువు నష్టం కలిగించే చర్యలకు పాల్పడకూడదంటూ షరతు విధించింది. ఈ కేసులో బాధితురాలు కూడా బెయిల్ ఇచ్చేందుకు తనకేమీ అభ్యంతరం లేదని కోర్టుకు తెలపడం విశేషం. జూన్ 18 నుంచి జూన్ 21 వరకు కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఇందుకోసం రూ.
50 వేల వ్యక్తిగత బాండ్, అదే మొత్తానికి సమానమైన ఒక ష్యూరిటీ సమర్పించాలని ఆదేశించింది. నీట్ రీ టెస్టు ముగిసిన మరుసటి రోజు, అంటే జూన్ 22 మధ్యాహ్నం 2 గంటల లోపు తిరిగి లొంగిపోవాలని కోర్టు స్పష్టం చేసింది. నిందితుడిపై అత్యాచార కేసు, పోక్సో చట్టం, 2012 కింద కేసులు నమోదయ్యాయి.
కోర్టులో నిందితుడి తరఫు న్యాయవాది విశ్వాస్ జోడ్గే మాట్లాడుతూ యువకుడికి తన భవిష్యత్‌ను సరిదిద్దుకునే అవకాశాం ఇవ్వాలని కోర్టును కోరారు. పోలీసుల పర్యవేక్షణలో పరీక్ష రాయడంతో మానసిక ఒత్తిడి పెరుగుతుందని
వాదించారు. నీట్ అడ్మిట్ కార్డు, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు పరిశీలించిన కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.