
‘‘ప్రవేశ పరీక్ష విధానంలో సమగ్రతను కాపాడేందుకు కేంద్రం తీసుకున్న చర్యలు సమర్థనీయమే. ఇవి అత్యంత తక్కువ ఆంక్షలతో కూడుకున్నవే. టెలిగ్రామ్ యాక్సెస్‌ను నిరోధించే అధికారం కేంద్రానికి ఉంది.
ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వం వివరించిన కారణాలు సహేతుకంగానే ఉన్నందున.. తాత్కాలిక నిషేధం సమంజసమే అని భావిస్తున్నాం’’ అని దిల్లీ హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది.
నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ (NEET Paper Leak) వ్యవహారం దేశవ్యాప్తంగా దుమారం లేపిన నేపథ్యంలో.. జూన్ 21న రీటెస్ట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షకు సంబంధించిన కొన్ని ముఠాలు టెలిగ్రామ్ వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ ఇటీవల దీనిపై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించింది. ప్రశ్నపత్రాల లీకేజీ, తప్పుడు వార్తల వ్యాప్తిని నివారించేందుకు, మోసపూరిత నెట్‌వర్క్‌లను అరికట్టడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. జూన్ 22 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించింది.
దీంతో ఈ నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై న్యాయస్థానం గురువారం విచారణ జరపగా.. ఈ యాప్‌పై కేంద్రం తీవ్ర ఆరోపణలు చేసింది. టెలిగ్రామ్ ‘కొత్త డార్క్ వెబ్’గా మారుతోందని, నేరగాళ్లకు సాధనంగా ఉందని ఆరోపించింది. సైబర్ నేరగాళ్లు, అతివాదులు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా సభ్యులు చట్టం నుంచి తప్పించుకునేందుకు దీన్ని ఎక్కువగా వాడుతున్నారని దుయ్యబట్టింది. దీనిపై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నిన్న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా టెలిగ్రామ్ పిటిషన్‌ను కొట్టేస్తూ నేడు తీర్పు వెలువరించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.