
ఇంటర్నెట్ డెస్క్: ఫిఫా ప్రపంచ కప్‌లో ఇవాళ నాలుగు మ్యాచులు జరిగాయి. ఆతిథ్య జట్లు మెక్సికో, కెనడా ఘన విజయాలు సాధించాయి. మెక్సికో నాకౌట్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా నిలిచింది. కెనడా ఆటగాడు జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేశాడు.
గురువారం అర్ధరాత్రి దక్షిణాఫ్రికా, చెకియా జట్లు తలపడ్డాయి. అయితే, ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆరో నిమిషంలోనే చెకియా ఆటగాడు మిచెల్ సాదిలిక్ గోల్ కొట్టి ఆధిక్యంలో నిలిపాడు. ఆ తర్వాత ఇరుజట్లూ గోల్స్ కోసం తీవ్రంగా శ్రమించాయి.
అయితే, పెనాల్టీ కిక్‌తో దక్షిణాఫ్రికా ప్లేయర్ టెబోహో 83వ నిమిషంలో గోల్ చేయడంతో స్కోర్లు సమమయ్యాయి. దీంతో ఓటమి నుంచి దక్షిణాఫ్రికా తప్పించుకొంది. గ్రూప్ Bలో బోస్నియాతో జరిగిన మ్యాచ్‌లో స్విట్జర్లాండ్ సూపర్ విక్టరీ సాధించింది.
స్విస్ 4-1 తేడాతో బోస్నియాను చిత్తు చేసింది. తొలి అర్ధభాగంలో ఇరు జట్లూ గోల్స్ కొట్టలేకపోయాయి. అయితే, 74వ నిమిషంలో జొహన్ మంజాబి గోల్ చేయడంతో స్విస్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ కాసేపటికే రుబెన్ వర్గాస్ (84వ నిమిషం) మరో గోల్ కొట్టడంతో స్విస్ 2-0 ఆధిక్యం సాధించింది.
ఇక 90వ నిమిషంలో జోహాన్ గోల్‌తో 3-0 లీడ్‌లోకి దూసుకెళ్లింది. ఆట అదనపు సమయంలో బోస్నియా ప్లేయర్ ఎమిన్ మహ్మిక్ (90+3వ నిమిషం) గోల్ రాబట్టి స్విస్ ఆధిక్యాన్ని 3-1కి తగ్గించాడు. కానీ, గ్రానిట్ (90+7వ నిమిషం) గోల్‌తో స్విస్ 4-1తేడాతో గెలుపును ఖరారు చేసుకుంది.
ప్రపంచ కప్‌నకు అమెరికా, మెక్సికోతో కలిసి కెనడా ఆతిథ్యం ఇస్తోంది. తొలి మ్యాచ్‌ను (బోస్నియాతో) డ్రా చేసుకున్న ఆ జట్టు.. ఖతార్‌పై విరుచుకుపడింది. కెనడా 6-0 తేడాతో ఖతార్‌ను చిత్తు చేసింది. ఖతార్ ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ సాధించాడు.
ఆట మొదలైన 16వ నిమిషంలోనే కేల్ లెరిన్ గోల్ కొట్టి కెనడాకు ఆధిక్యం అందించాడు. జొనాథన్ 29వ నిమిషం, 45+3వ
నిమిషం, 90+2వ నిమిషం వద్ద గోల్స్ సాధించాడు. కెనడా ప్లేయర్ మహ్మద్ మనై (75వ నిమిషం) కూడా ఒక గోల్ సాధించాడు. మరోవైపు ఖతార్ కనీసం గోల్ పోస్టు వైపు బంతిని కొట్టడంలోనూ విఫలమైంది. ఏమాత్రం ప్రభావం చూపించలేదు.
ప్రపంచ కప్‌లో నాకౌట్‌కు చేరిన తొలి జట్టుగా ఆతిథ్య మెక్సికో నిలిచింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి గ్రూప్ Aలో అగ్రస్థానం సాధించింది. దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్‌లో మెక్సికో 1-0 ఆధిక్యంతో విజయం సాధించింది. మెక్సికో ఆటగాడు లూయిస్ రోమో 50వ నిమిషంలో గోల్ కొట్టాడు. సౌత్ కొరియా నుంచి గోల్ పోస్టు వైపు కేవలం రెండుసార్లు మాత్రమే షాట్లు కొట్టడం గమనార్హం. ఏదీ సఫలం కాకపోవడంతో ఓటమి తప్పలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.