
భూమిపై ఉన్న నీరు సూర్యరశ్మి కారణంగా ఆవిరై వాతావరణంలోకి చేరుతుంది. ఈ నీటి ఆవిరి పైకి వెళ్లే కొద్దీ చల్లబడుతుంది. ఆ సమయంలో చిన్న చిన్న నీటి అణువులు ఒకదానితో ఒకటి కలుస్తాయి. ఇలా లక్షలాది సూక్ష్మ నీటి బిందువులు కలిసి మేఘాలను ఏర్పరుస్తాయి.
మొదట ఈ నీటి బిందువులు చాలా చిన్నగా ఉంటాయి. క్రమంగా మరిన్ని నీటి అణువులు చేరడంతో అవి పెద్దవిగా మారుతాయి. ఒక దశకు చేరుకున్న తర్వాత వాటి బరువు పెరిగి భూమి వైపు పడటం ప్రారంభిస్తాయి. వీటినే మనం వర్షపు చినుకులు అంటాం. నీటి అణువుల మధ్య ఉండే "సర్ఫేస్ టెన్షన్" అనే శక్తి కారణంగా నీరు సహజంగా గుండ్రటి ఆకారాన్ని ఏర్పరుచుకుంటుంది.
సర్ఫేస్ టెన్షన్ అంటే నీటి ఉపరితలంపై ఉండే అణువులు ఒకదానిని మరొకటి ఆకర్షించుకోవడం. ఈ ఆకర్షణ వల్ల నీరు తక్కువ స్థలంలో ఎక్కువ పరిమాణాన్ని ఉంచుకునేలా ప్రయత్నిస్తుంది. దీనివల్ల నీటి బిందువు గుండ్రంగా మారుతుంది. అందుకే మేఘాల్లో ఏర్పడే చిన్న నీటి బిందువులు దాదాపు పూర్తిగా గుండ్రటి ఆకారంలో ఉంటాయి.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ప్రభావం తక్కువగా ఉన్నప్పుడు నీటి బిందువులు సంపూర్ణ గోళాకారంలో కనిపిస్తాయి. వర్షపు చినుకులు మేఘాల నుంచి కిందికి పడేటప్పుడు గాలి ప్రతిఘటన (Air Resistance) ఎదురవుతుంది. ఈ గాలి ఒత్తిడి చినుకు కింద భాగంపై ఎక్కువ ప్రభావం చూపుతుంది.
దీని వల్ల చినుకు కింద భాగం కొద్దిగా చదునుగా మారుతుంది. పై భాగం మాత్రం గుండ్రంగానే ఉంటుంది. దీంతో చినుకు ఆకారం హాంబర్గర్ బన్ లేదా చిన్న గొడుగు మాదిరిగా కనిపిస్తుంది. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ NASA చేసిన అధ్యయనాల ప్రకారం మధ్యస్థ పరిమాణం ఉన్న వర్షపు చినుకులు పైభాగంలో గుండ్రంగా, కింద భాగంలో కొద్దిగా చదునుగా ఉంటాయి.
అంటే మనం ఊహించే కన్నీటి బొట్టు ఆకారం అసలు ఉండదు. చాలా పెద్ద పరిమాణంలో ఉన్న వర్షపు చినుకులు
మరింత గాలి ఒత్తిడిని ఎదుర్కొంటాయి. దీంతో అవి పూర్తిగా వంగిపోవడం ప్రారంభిస్తాయి. ఒక దశలో అవి పారాచూట్ ఆకారం లేదా జెల్లీ ఫిష్ మాదిరిగా కనిపిస్తాయి. ఇంకా పెద్దవైతే గాలి ఒత్తిడిని తట్టుకోలేక చిన్న చిన్న చినుకులుగా విడిపోతాయి. అందుకే ప్రకృతిలో చాలా పెద్ద వర్షపు చినుకులు కనిపించవు. అవి కిందికి చేరుకునేలోపే చిన్న బిందువులుగా విరిగిపోతాయి. ఇది ప్రకృతిలో జరిగే అద్భుతమైన భౌతిక శాస్త్ర ప్రక్రియ.
చాలామంది ఇక్కడే పొరబడుతారు. వర్షపు చినుకులు కాదు, కిటికీ అద్దంపై లేదా ఆకులపై జారుతున్న నీటి బిందువులు మాత్రమే కన్నీటి బొట్టు ఆకారంలో కనిపిస్తాయి. ఎందుకంటే అవి కదులుతున్న సమయంలో గురుత్వాకర్షణ ప్రభావంతో కిందకు లాగబడతాయి. అందువల్ల పొడవైన చివర ఏర్పడుతుంది. పురాతన చిత్రాలు, కార్టూన్లు, పాఠ్యపుస్తకాల్లో ఈ ఆకారాన్నే వర్షపు చినుకులకు ప్రతీకగా ఉపయోగించారు. సులభంగా గుర్తుపట్టేందుకు ఈ డిజైన్ విస్తృతంగా ప్రాచుర్యం పొందింది. క్రమంగా అదే నిజమని చాలామంది నమ్మడం ప్రారంభించారు.