తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులు విరాళాలు, కానుకలు అందజేస్తుంటారు. ముఖ్యంగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ట్రస్టులకు భక్తుల నుంచి విరాళాలు వస్తున్నాయి. టీటీడీ ఈ ట్రస్టుల ద్వారా పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అలాగే పేదలకు అవసరమైన వైద్య సాయం కూడా అందిస్తున్నారు.
ఇటీవల కాలంలో టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు భక్తుల నుంచి భారీగా విరాళాలు వస్తున్నాయి. గత రెండేళ్లలో టీటీడీ ట్రస్టులకు రికార్డు స్థాయిలో విరాళాలు అందాయి. తాజాగా మరో వ్యాపార సంస్థ భారీ విరాళం అందించారు. తిరుమల శ్రీవారికి హైదరాబాద్కు చెందిన అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ టీటీడీకి భారీ విరాళం అందజేసింది.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ వేంకటేశ్వర ఆపన్న హృదయ పథకానికి అపర్ణ ఎంటర్ ప్రైజస్ లిమిటెడ్ సంస్థ రూ.కోటి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో అధికారులకు విరాళం చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా దాతను అధికారులు అభినందించారు. పేద, అవసరమైన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో ఈ విరాళం ఎంతో ఉపయోగపడుతుందన్నారు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు. సమాజ సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన అపర్ణ ఎంటర్ప్రైజెస్ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. అపర్ణ ఎంటర్ప్రైజెస్ సంస్థ గతేడాది కూడా రూ.కోటి విరాళం అందించారు.తిరుమలలో అన్నప్రసాదాల తయారీలో నాణ్యమైన పప్పు దినుసులను వినియోగించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు చెందిన పప్పు మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో టీటీడీకి అవసరమైన పప్పు దినుసుల నాణ్యత, పరిమాణం, సరఫరా తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. రోజువారీ అన్నప్రసాదాల తయారీలో శనగలు, పొట్టు తీసిన మినుములు, పొట్టుతో కూడిన మినుములు, కందిపప్పు, పెసరపప్పు
, వేరుశెనగలు వంటి ఏడు రకాల పప్పు దినుసులను టీటీడీ వినియోగిస్తోందని అదనపు ఈవో తెలిపారు.గత కొన్నేళ్లుగా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా బియ్యాన్ని కొనుగోలు చేస్తున్నామని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల నుంచి కూడా నాణ్యతతో పాటు అవసరమైన పరిమాణంలో పప్పు దినుసులు సరఫరా చేయాలని కోరారు. దీనికి స్పందించిన ఆంధ్రప్రదేశ్ పప్పు మిల్లర్ల ప్రతినిధులు, ప్రతిరోజూ లక్షలాది మంది భక్తులకు మహా యజ్ఞంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ సేవలో భాగస్వాములై, నాణ్యమైన పప్పు దినుసులను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అనంతరం పప్పు మిల్లర్ల నుంచి పప్పు దినుసుల కొనుగోలుకు ఉన్న పారదర్శకమైన విధానాలను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను అదనపు ఈవో ఆదేశించారు.