
విజయ్ ఆంటోనీ, శశి కాంబినేషన్లో 'బిచ్చగాడు' తర్వాత వచ్చిన సినిమా 'వంద దేవుళ్ళు'. అమ్మకు పెళ్ళి కాన్సెప్ట్ తో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. ప్రముఖ సంగీత దర్శకుడు, నటుడు, దర్శక నిర్మాత విజయ్ ఆంటోని (Vijay Antony) ఏ సినిమా చేసినా...
అందులో అర్థం, పరమార్థం ఉంటుంది. కేవలం కమర్షియల్ పర్పస్తో సినిమాలు చేయడం ఆయనకు అలవాటు లేని పని. ఇంతవరకూ నటుడిగా తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి సొంత సినిమాలు తీసిన విజయ్ ఆంటోని ఇప్పుడు తాను బ్యాక్ సీట్ లో కూర్చుని కథకు పెద్ద పీట వేస్తూ నిర్మించిన సినిమా 'వంద దేవుళ్ళు'.
విజయ్ ఆంటోనితో 'బిచ్చగాడు' (Bichagadu) వంటి బ్లాక్ బస్టర్ మూవీని చేసిన శశి (Sasi) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వాసవి (స్వాసిక Swasika) ఇద్దరు పిల్లల తల్లి. యుక్తవయసులోనే భర్తను పోగొట్టుకుంటుంది. అక్కడి నుంచి పిల్లలే జీవితంగా గడుపుతుంది.
వితంతువు వాసవి అంటే ఊరిలో మగాళ్ళందరికీ అలుసే. అవకాశం కోసం గోతి కాడ నక్కల్లా కాచుకుని ఉంటారు. అయినా నిబ్బరంగా జీవితాన్ని సాగిస్తుందామె. ఇద్దరు మగపిల్లలు భాస్కర్ (అజయ్ దిషాన్ Ajay Dishan), వివేక్ (శక్తి Shakthi) పెళ్ళికి ఎదిగిన తర్వాత తనకూ ఓ తోడు కావాలనే భావన ఆమెలో కలుగుతుంది.
అయితే ఆ నిర్ణయాన్ని తొలుత ఆమోదించని కొడుకులిద్దరూ ఆ తర్వాత మనసు మార్చుకుంటారు. తల్లికి పెళ్ళి చేయడం కోసం వరుడిని వెతకడం మొదలు పెడతారు. ఈ క్రమంలో అప్పటికే భార్యను పోగొట్టుకున్న ఏడు కొండలు (విజయ్ ఆంటోనీ)ని వివాహం చేసుకోవాలని వాసవి అనుకుంటుంది.
అయితే ఆమె గ్రామానికి చెందినపెద్దిరెడ్డి (బాలాజీ శక్తివేల్) ఈ ప్రయత్నాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు... సొంత కుటుంబ సభ్యులు సైతం ఆమె నిర్ణయాన్ని తప్పు పడతారు. వీరందరి కుట్రలను ఎదుర్కొని కొడుకలిద్దరూ కలిసి తమ తల్లి పెళ్ళి ఎలా
చేశారన్నదే క్లయిమాక్స్.
నిజం చెప్పాలంటే ఈ సినిమాకు హీరో విజయ్ ఆంటోనీ కాదు... కాస్తంత నిడివి ఎక్కువ ఉన్న అతిథి పాత్రను చేశాడని అనుకోవాలి. ఈ సినిమా హీరో స్వాసిక. ఇది ఆమె కథే! కొడుకులే ప్రాణంగా జీవితాన్ని గడిపే ఓ మహిళ... మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనుకున్నప్పుడు కుటుంబ సభ్యుల నుంచి, సమాజం నుంచి ఎలాంటి అవాంతరాలు వచ్చాయి? కేవలం తన స్వార్థం కోసం కాకుండా తనలాంటి వితంతువులకు ఓ మార్గం చూపాలని ఆమె తీసుకున్న నిర్ణయాన్ని ఎవరు, ఎందుకు తప్పు పట్టారు? ఆ సమయంలో ఎవరు ఆమెకు బాసటగా నిలిచారు? అనే దాన్ని దర్శకుడు శశి ఆసక్తికరంగా మలిచారు. సినిమాలోని చాలా సన్నివేశాలు ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతాయి. ముఖ్యంగా ఆమె నిర్ణయం పట్ల ప్రధాన ప్రతిఘటన కొడుకుల నుండి వస్తుందని ప్రేక్షకులు ఊహిస్తారు. కానీ ఒకటి రెండు సన్నివేశాలతో ఆ పాత్రలను పాజిటివ్ గా మార్చేస్తాడు దర్శకుడు. మరి ఈ సినిమాకు విలన్ ఎవరు? ఏ పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి మరో వ్యక్తి ప్రవేశిస్తాడు? అనే ప్రశ్నకు ద్వితీయార్థంలో గానీ సమాధానం లభించదు. అక్కడ నుంచి సినిమా కొంత నాటకీయ ఫక్కీలో సాగుతుంది. ఎవరూ ఊహించని విధంగా, యాక్షన్ ఎపిసోడ్ లేకుండానే వినోదాత్మకంగా దర్శకుడు శశి శుభం కార్డు వేశాడు.
ఈ తరహా కథాంశాలు తెలువారికి కొత్తేమీ కాదు... దాదాపు నలభై ఏళ్ళక్రితమే దర్శక నిర్మాత క్రాంతికుమార్ సుహాసిని నాయికగా అమ్మకు మళ్ళీ పెళ్ళి అనే పాయింట్ తో 'స్వాతి' మూవీని తెరకెక్కించారు. ఆ తర్వాత పుష్కర కాలానికి ఇవీవీ సత్యనారాయణ... శ్రీకాంత్ హీరోగా 'మా నాన్నకు పెళ్ళి' సినిమాను రూపొందించారు. తల్లిదండ్రులకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకునే పిల్లలు కథలతో కొన్ని సినిమాలు ఇప్పటికే వచ్చాయి. అయితే వాటి ట్రీట్ మెంట్ వేరు. బాధాకరం ఏమిటంటే... ఇలాంటి కథాంశాలతో ఎన్ని సినిమాలు వచ్చినా... భార్య చనిపోయిన వ్యక్తికి మళ్ళీ పెళ్ళి చేయడానికి ఆసక్తి చూపించే ఈ సమాజం... వితంతువుకు మళ్ళీ పెళ్ళి చేసే విషయంలో వెనకడుగు వేస్తూనే ఉంది. అందువల్ల ఈ సినిమాలో చర్చించిన అంశం ఇప్పటికీ విలువైనదే! ఆ రకంగా చూసినప్పుడు మహిళ మనోభావాలను, సమాజంలో ఆమె ఎదుర్కొంటున్న సమస్యలను దర్శకుడు శశి కళ్ళకు కట్టినట్టు చూపించాడు.
నటీనటుల విషయానికి వస్తే... వితంతువు పాత్రకు స్వాసిక ప్రాణం పోసింది. ఈ సినిమాను తన భుజాలపై మోసింది. ఆమె పెద్ద కొడుకుగా విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దుషాన్ చక్కగా నటించాడు. అలానే రెండో కొడుకు పాత్ర చేసిన శక్తి సైతం పాత్రోచితంగా చేశాడు. వారిద్దరి ప్రియురాళ్ళుగా కావ్య అనిల్, పాదిని కుమార్ నటించారు. ఇతర కీలక పాత్రలను బాలాజీ శక్తివేల్, కరుణాస్, మునీష్ కాంత్, వినోదిని, లిజోమోల్ తదితరులు పోషించారు. బాలాజీ శ్రీరామ్ నేపథ్య సంగీతం, భాషాశ్రీ సాహిత్యం, ఎస్.బి. దర్శన్ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. అయితే ఇలాంటి సినిమాలకు విమర్శకుల ప్రశంసలు లభించినంతగా... కమర్షియల్ సక్సెస్ దక్కడం కష్టం. విజయ్ ఆంటోనీ - శశి 'బిచ్చగాడు' తర్వాత చేసిన సినిమా కావడంతో 'వంద దేవుళ్ళు' మీద అంచనాలు ఉండటం సహజం. కానీ దానితో 'వంద దేవుళ్ళు'ను పోల్చలేం. కాకపోతే... విజయ్ ఆంటోనీ తనను తాను తగ్గించుకుని, కథకు ప్రాధాన్యం ఇవ్వడం అభినందించాల్సిన విషయం. నిజంగా జరిగిన సంఘటనతో రూపుదిద్దుకున్న ఈ సినిమా క్లయిమాక్స్ జన్ జీ ఆడియెన్స్ నూ ఆకట్టుకునేలా ఉంది. మరి కమర్షియల్గా ఎలాంటి స్పందన లభిస్తుందో చూడాలి!