కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం లక్షలాది మంది తిరుపతికి చేరుకుంటారు. స్వామి వారి దర్శనం కోసం కొండపైకి వెళ్లి.. గంటల తరబడి నిరీక్షించి.. కొన్ని క్షణాల పాటు దర్శించుకుంటారు. అయితే శ్రీవారిని దర్శించుకోవడానికి అనేక రకాల టికెట్లు, సేవలు, దర్శనాలు భక్తులకు అందుబాటులో ఉంటాయి.
ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా పూర్తిగా ఉచితంగా సర్వదర్శనం ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక రూ.300, రూ.500, రూ.10,500 రకరకాల టికెట్లను కూడా బుక్ చేసుకుని శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) భక్తులకు అవకాశం కల్పించింది.
అయితే సాధారణంగా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు.. స్వామివారిని జయ, విజయ ద్వారం నుంచి చూస్తారు. కానీ శ్రీవారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవాలంటే రూ.10,500 విలువైన శ్రీవాణి టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో రూ.10 వేలు శ్రీవాణి ట్రస్ట్‌కు వెళ్లగా..
రూ.500 దర్శనం కోసం చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇదే మొదటి గడప దర్శనాన్ని కేవలం రూ.120తో స్వామివారిని చూసే అవకాశం కూడా ఉంటుంది. అదే ఎలక్ట్రానిక్ ఈ-డిప్. ప్రతీ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీ వరకు లక్కీ డిప్ ద్వారా వివరాలు నమోదు చేసుకున్న వారిలో కొందరికి మాత్రమే ఈ అదృష్టం దక్కుతుంది.
టీటీడీ యాప్, వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత శ్రీవారి ఆర్జిత సేవ (ఎలక్ట్రానిక్ డిప్) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. సాధారణంగా ప్రతీ నెల 18వ తేదీన ఉదయం 8 గంటలకు ఈ ఈ-డిప్ ప్రారంభం అవుతుంది. 20వ తేదీ ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్లు అందుబాటులో ఉంటాయి.
ఇక అదే 20వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు.. ఈ ఈ-డిప్లో సెలెక్ట్ అయిన వారికి మెసేజ్‌లు వస్తాయి. దానికి సంబంధించిన పేమెంట్‌ను చేస్తే.. టికెట్ బుక్ అవుతుంది. దీంతో ఏ రోజు అయితే టికెట్ బుక్
అవుతుందో ఆ రోజు తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని మొదటి గడప దగ్గరి నుంచి దర్శనం చేసుకునే అవకాశం ఇస్తారు.ఇక ఈ శ్రీవారి ఆర్జిత సేవ (ఎలక్ట్రానిక్ డిప్)లో మొత్తం 4 రకాల దర్శనాలు ఉంటాయి. సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ, అష్టాదళ పాద పద్మారాధన అని వేర్వేరు సేవలు ఉంటాయి. ఇందులో అతి తక్కువ టికెట్ ధర సుప్రభాత సేవకు రూ.120గా ఉంటుంది. ఇక తోమాల సేవ, అర్చనకు రూ.220 టికెట్ ధర కాగా.. అష్టాదళ పాద పద్మారాధన టికెట్ ధర రూ.1250గా ఉంటుంది. లక్కీ డిప్లో పేరు వచ్చిన వారు.. ఏ సేవ వచ్చిందో ఆ సేవకు సంబంధించిన టికెట్ ధరను చెల్లించి.. టికెట్‌ను కన్ఫామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టికెట్లను 3 నెలల ముందే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే జూన్ నెలలో ఈ డిప్ వేస్తే.. సెప్టెంబర్ నెలలో దర్శనాలు కల్పిస్తారు. ఇక ఆన్‌లోన్‌లో మాత్రమే కాకుండా ఆఫ్‌లైన్‌లో కూడా ఈ 4 రకాల సుప్రభాత సేవ, అర్చన, తోమాల సేవ, అష్టాదళ పాద పద్మారాధన టికెట్లను బుక్ చేసుకునే అవకాశాన్ని టీటీడీ ఇచ్చింది. తిరుమల కొండపై సీఆర్ఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న బుకింగ్ కౌంటర్లో ఆఫ్‌లైన్ డిప్ వేస్తే.. అందులో సెలెక్ట్ అయిన వారికి ఆ తర్వాతి రోజే దర్శనాలు కల్పిస్తారు. కాబట్టి.. ఈసారి తిరుమలకు వెళ్తే తప్పకుండా ఈ ఆఫ్‌లైన్ డిప్ వేయడం అస్సలు మర్చిపోకండి.