ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసుడు హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దివంగత కృష్ణ, మహేష్ బాబుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, రమేష్ బాబు తనయుడు జయకృష్ణ తెరంగేట్రం చేస్తున్నాడు. 'Rx 100', 'మంగళవారం' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం కాబోతున్నాడు. అశ్వినీ దత్ సమర్పణలో, జెమినీ కిరణ్ ‘చందమామ కథలు’ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడానీ హీరోయిన్ గా నటిస్తుండగా.. మంచు మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కృష్ణ జయంతి సందర్భంగా శ్రీను&మంగా పాత్రలని పరిచయం చేస్తూ శనివారం సాయంత్రం గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు.ఈ సందర్భంగా జయకృష్ణ ఘట్టమనేని మాట్లాడుతూ.. ''తాతయ్య పుట్టినరోజు సందర్భంగా మీ అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉంది. తాతయ్య నాకు దేవుడితో సమానం. ఆయనపై నాకు ఉన్న అభిమానాన్ని మాటల్లో చెప్పలేను. ఆయన ఎక్కడ ఉన్నా తన ఆశీస్సులు నాతో ఉంటాయని నమ్ముతున్నాను. ‘శ్రీనివాస మంగాపురం’ నా తొలి చిత్రం. అజయ్ భూపతి ఈ కథ చెప్పినప్పుడు ఇందులో ఉన్న ఎమోషన్స్, నా పాత్రలోని డెప్త్ నన్ను చాలా ఆకట్టుకున్నాయి. ఈ క్యారెక్టర్ ద్వారా నన్ను నేను ఛాలెంజ్ చేసుకోవచ్చని, నటుడిగా నిరూపించుకునే అవకాశం దొరుకుతుందని భావించాను. అజయ్ భూపతితో కలిసి పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందంగా ఉంది. నా తొలి సినిమాకే ఆయనలాంటి దర్శకుడు దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను'' అని అన్నారు.''అశ్వినీదత్ మా తాతతో ‘అగ్నిపర్వతం’, బాబాయ్ మహేష్ బాబుతో ‘రాజకుమారుడు’ సినిమాలు చేశారు. ఇప్పుడు నన్ను హీరోగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను. నిర్మాత కిరణ్ నాకు అజయ్
భూపతిని పరిచయం చేశారు. ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. హీరో అవ్వాలనే ఆలోచనకు ప్రేరణ మా బంగారు తాతయ్య. ఆయన లేకపోతే నేను ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు. ఈ సినిమాను అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారని నమ్ముతున్నాను. నేను మహేష్ బాబాయ్‌కు డైహార్డ్ ఫ్యాన్‌ని. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను ఆయనే లాంచ్ చేశారు. ఎప్పటికప్పుడు నాకు ఫీడ్‌బ్యాక్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు. థ్యాంక్యూ సో మచ్ బాబాయ్. ఈ సందర్భంగా మా నాన్నని తలుచుకుంటున్నాను'' అని జయకృష్ణ అన్నారుడైరెక్టర్ అజయ్ భూపతి మాట్లాడుతూ.. ''ఒకపక్క అశ్వినీదత్, మరోపక్క కిరణ్, ఇంకోపక్క ఆదిశేషగిరిరావు, కనిపించని నాలుగో సింహం మా స్వప్న(నవ్వుతూ). ఈ నలుగురితో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. ఈరోజు ఇండియాలో టాప్ లేడీ ప్రొడ్యూసర్ స్వప్న. కృష్ణ గారు అంటే మామూలు విషయం కాదు. ఆయన నిజమైన సూపర్ స్టార్. ఆయన చేసినంత రిస్క్ ఏ హీరో కూడా చేసి ఉండరు. ఆయన క్వాలిటీస్ జయకృష్ణలో ఉన్నాయి. కచ్చితంగా జయకృష్ణ చాలా పెద్ద హీరో అవుతాడు. ‘శ్రీనివాస మంగాపురం’ ఆడియో బ్లాక్‌బస్టర్ అవుతుంది. రాషా అద్భుతంగా నటించింది. జయకృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంటుంది. రాషా, జయకృష్ణ పోటీపడి నటించారు. జీవీ ప్రకాష్ పాటలన్నీ అదరగొట్టాడు. ఇది దాదాపు పూర్తిగా అవుట్ డోర్లో తెరకెక్కించిన సినిమా. ఆ ఫీల్ మీకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్‌కు పేరుపేరునా ధన్యవాదాలు'' అని అన్నారు.తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ''తెలుగు సినిమాకు కొత్త అందం, వన్నె తీసుకొచ్చిన నిర్మాత అశ్వినీ దత్. అలాగే తెలుగు సినిమాకు కొత్త దిశ చూపించిన దర్శకుడు రాఘవేంద్రరావు. వీరిద్దరూ కలిసి ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఇప్పుడు దత్తు గారి నిర్మాణంలో జయకృష్ణ పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది. సినిమాను చాలా అద్భుతంగా తీశారు. స్వప్న ఈ సినిమా చూసి ‘చాలా బాగుంది అంకుల్’ అని చెప్పింది. అది మాకు పాస్ సర్టిఫికెట్ లాగా అనిపించింది. జయకృష్ణ మొదట్లో బాగా సిగ్గు పడుతూ ఉండేవాడు. 'ఏమయ్యా.. కొంచెం ఓపెన్ అవ్వు' అని చెబితే.. 'ఎట్లా చేస్తారు' అని గొణిగాడు. నన్ను తిట్టుకొని ఉంటాడు. రెండు షెడ్యూల్స్ అయిపోయిన తర్వాత, కృష్ణ గారిలాగే జయకృష్ణ విశ్వరూపం చూపించాడు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ అలరిస్తుంది. కృష్ణ గారు ఎక్కడ ఉన్నా జయకృష్ణను ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను'' అని అన్నారు.