
ఇంటర్నెట్ డెస్క్: ఇప్పుడు భారత క్రికెట్లో కొత్త పేస్ గుర్రం గుర్నూర్ బ్రార్. నిలకడగా 145+ కి.మీ వేగంతో బంతులేయడం అతడి స్పెషాలిటీ. లైన్ అండ్ లెంగ్త్ విషయంలోనూ ఫర్ఫెక్టే. అయితే, తాను దేశవాళీ నుంచి నేర్చుకున్న పాఠాలే అంతర్జాతీయ క్రికెట్లో దోహదపడ్డాయని బ్రార్ వ్యాఖ్యానించాడు.
ఇండియా Aతో కలిసి చేసిన ప్రయాణమే కలిసొచ్చిందని తెలిపాడు. అఫ్గానిస్థాన్‌తో వన్డే సిరీస్‌లో గుర్నూర్ బ్రార్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. రెండు మ్యాచుల్లో ఆరు వికెట్లు తీసిన అతడే టాప్ వికెట్ టేకర్. ‘‘భారత్ A సెటప్ నాకు పెద్ద ప్లస్ పాయింట్ అయింది.
దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేయడంతో ఇండియా ఏ నుంచి పిలుపు వచ్చింది. దేశవాళీలో ఎలాగైతే బౌలింగ్ చేశానో.. అలానే భారత్ A తరఫున బంతిని విసిరా. హార్డ్ లెంగ్త్‌తో బంతిని స్వింగ్ చేయగలిగా. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాక కూడా అదే చేస్తున్నా.
గత రెండు మ్యాచుల్లో నా ప్రదర్శన తర్వాత.. ఇంకా మెరుగు కావాల్సిన అవసరం ఉందని భావిస్తున్నా. ఇంతకంటే బాగా బౌలింగ్ చేయగలనని నాకు తెలుసు. మేనేజ్మెంట్ మాత్రం నాకెలాంటి కొత్త టిప్స్ ఇవ్వకుండా.. కేవలం నా బలాన్ని నమ్మి బౌలింగ్ చేయమని చెప్పింది’’ అని గుర్నూర్ తెలిపాడు.
‘‘గుజరాత్ టైటాన్స్‌తో ఉండటం నాకు కలిసొచ్చింది. ఆశిశ్ నెహ్రా సర్, కగిసో రబాడ, సిరాజ్ భాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ వంటి ఫాస్ట్ బౌలర్ల నుంచి చాలా నేర్చుకున్నా. ప్రతి క్రికెటర్ తమ అవకాశం ఎదురు చూస్తుంటారు. నేను కూడా అలా చూసినవాడినే.
ఆ స్టార్ బౌలర్ల బౌలింగ్‌ను దగ్గర్నుంచి గమనించా. ఎప్పుడూ వేగాన్నే నమ్ముకోకూడదు. కొందరు బ్యాటర్లకు పేస్ అంటే చాలా ఇష్టం. పిచ్ నుంచి సహకారం లేనప్పుడు ప్రత్యర్థిని బట్టి బౌలింగ్‌లో మార్పులు చేసుకోవాలి. బంతి స్వింగ్ కానప్పుడు వ్యూహం మార్చుకోవాలి’’ అని వివరించాడు
. 2023లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన అతడు.. పంజాబ్ కింగ్స్ తరఫున కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. 2025 మెగా వేలంలో గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.1.3 కోట్లకు తీసుకుంది. కానీ, గత సీజన్లో మాత్రం అవకాశం రాలేదు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.