ఐపీఎల్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఒకటి. ఐపీఎల్ ప్రారంభ సీజన్ 2008 నుంచి ఇప్పటివరకు ఆ జట్టు ఈ టోర్నీలో పాల్గొంటోంది.
సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్ 2025 ద్వారా తొలిసారి టైటిల్ సాధించిన ఆ జట్టు.. ఐపీఎల్ 2026లోనూ విజేతగా నిలిచి, వరుసగా రెండో ట్రోఫీ ముద్దాడింది. ఇక ఆర్సీబీకి ఈ రేంజ్లో క్రేజ్ రావడానికి ముఖ్య కారణం విరాట్ కోహ్లీ . అవును ఆర్సీబీ అంటే కోహ్లీ.. కోహ్లీ అంటే ఆర్సీబీ అన్నట్లుగా ముద్ర పడిపోయింది. ఇటీవల ఆర్సీబీ టైటిల్ సాధించడంలోనూ అతడు కీలకపాత్ర పోషించాడు.తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈవో రాజేశ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ భవితవ్యం గురించి ఆయన మాట్లాడారు. “రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, విరాట్ కోహ్లీ ఒకే నాణేనికి 2 వైపులు. ఆర్సీబీ విజయవంతమవ్వడంతో కోహ్లీ పాత్ర ముఖ్యమైనది. క్రికెట్‌కు వీడ్కోలు పలికినా సరే అతడిని మేము ఆర్సీబీ జట్టులో ఒకడిగానే చూస్తాం. వచ్చే 3-4 సంవత్సరాలు విరాట్ ఆర్సీబీకి ఆడుతాడని నాకు నమ్మకముంది” అని ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ పేర్కొన్నారు.ఇక ప్రస్తుతం విరాట్ కోహ్లీ.. టెస్ట్, టీ20లకు గుడ్‌బై చెప్పి, కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. అయితే గాయం కారణంగా అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. అతడు ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో అదరగొట్టాడు. 16 మ్యాచ్‌లలో 675 పరుగులు చేశాడు. ముఖ్యంగా ఫైనల్లో అజేయ హాఫ్ సెంచరీతో జట్టును గెలిపించాడు. విన్నింగ్ షాట్ కొట్టి.. ఆర్సీబీకి రెండో టైటిల్ అందించాడు.37 ఏళ్ల విరాట్ కోహ్లీ.. వన్డే ప్రపంచకప్ 2027 ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత అతడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది. ప్రస్తుత ఫిట్నెస్ ప్రకారం చూస్తే.. రాజేశ్ మీనన్ చెప్పినట్లు మరో నాలుగేళ్లు కోహ్లీ ఈజీగా ఐపీఎల్ ఆడేయగలడని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.